Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుబేరుల్లో నాలుగో స్థానం
- బిల్‌గేట్స్‌నూ వెనక్కి నెట్టారు
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలతో సామాన్యుల సంపాదన కుటుంబ పోషణకు కూడా సరిపోక పోగా.. మరోవైపు గౌతం అదానీ సంపద మాత్రం రాకేట్ వేగం కంటే ఎక్కువగా పెరుగుతోంది. కేవలం ఒక్క ఏడాదిలోనే ఆయన సంపద రెట్టింపు అయ్యింది. తాజాగా ప్రపంచ కుబేరుల్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టి అదానీ నాలుగో స్థానంలోకి వచ్చారని ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో వెల్లడించింది. ఇటీవల బిల్ గేట్స్ 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.59 లక్షల కోట్లు)ను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గేట్స్ ఒక స్థానం కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు అదానీ సంపద 114 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9.10 లక్షల కోట్లు)తో నాలుగో స్థానానికి ఎగబాకారు. అత్యంత కుబేరుల్లో టెస్లా అధినేత, సీఈఓ ఎలన్ మస్క్ 230 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండు, మూడు స్థానాల్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్‌లు నిలిచారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పదో స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7 లక్షల కోట్లు)గా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముకేశ్‌ను వెనక్కి నెట్టి అదానీ ముందు స్థానంలోకి వచ్చి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న అదానీ 2021 నుంచి ఇప్పటి వరకు రెట్టింపు సంపదను పోగు చేశారు. పునరుత్పాదన ఇంధన ఉత్పత్తిలో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల అదానీ ప్రకటించారు.