Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన రుణ ఎగవేతలు
- బ్యాంక్‌లకు రూ.2.4 లక్షల కోట్ల కన్నం
- ఉద్దేశపూర్వకంగానే ఎగనామం
నవతెలంగాణ - బిజినెస్ డెస్క్
దేశ బ్యాంకింగ్ రంగానికి బడా పారిశ్రామికవేత్తలు ప్రమాదకరంగా మారారు. కార్పొరేట్ దిగ్గజాలుగా చెప్పుకుంటున్న అనేక మంది కావాలనే భారత బ్యాంక్‌లకు లక్షల కోట్లు ఎగనామం పెడుతున్నారని రిపోర్టులు వస్తున్నాయి. గడిచిన 10 సంవత్సరాల్లోనే ఇలాంటి రుణ ఎగవేతలు 10 రెట్లు పెరిగాయి. 2012 నుంచి ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగానే రూ.2.4 లక్షల కోట్లు చెల్లించలేదు. 2012 నాటికి ఈ విలువ రూ.23,000 కోట్లుగా ఉంది. ట్రాన్స్ యూనియన్ సిబిల్ గణంకాల ప్రకారం.. దేశంలో రుణ ఎగవేతలు భారీగా పెరుగుతున్నాయి. విత్త సంస్థల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఎగనామం పెట్టే వారిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిగణిస్తుంది. అదే విధంగా వాస్తవ అవసరాలకు తీసుకున్న రుణాలను అక్రమంగా ఇతర వాటికి మళ్లించిన ఈ కోవలోకే వస్తాయి. ఈ గణంకాల్లో రూ.25 లక్షల పైబడిన రుణాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2022 మే 31 నాటికి ఈ తరహా ఎగవేతదారులు 12,000 పైగా నమోదయ్యారు. ఈ పదేండ్ల కాలంలో బ్యాంక్‌లకు అత్యధిక రుణాలు ఎగ్గొట్టిన వారిలో రిషీ అగర్వాల్, అర్వింద్ దామ్, మెహుల్ చోక్సీ, సందేశ్వర సోదరులు ఉన్నారు. బ్యాంక్‌లకు వేల కోట్లు కన్నమేసి బ్రిటన్ పారిపోయిన విజయ మాల్యా, నీరవ్ మోడీని ఈ ఎగవేతదారుల జాబితాలో చేర్చలేదు. పారిశ్రామికవేత్తలు ఎగవేసిన రూ.2.4 లక్షల కోట్ల సొమ్ము.. దాదాపుగా వైద్య శాఖకు కేటాయించే నిధుల కంటే 2.7 రెట్లు ఎక్కువ. మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.1.4 లక్షల కోట్ల కేటాయింపులు చేస్తున్నారు. దీంతో పోల్చినా రెండు రెట్ల ఎగవేతలు జరిగాయి. రూ.2.4 లక్షల కోట్లను డాలర్లకు మార్చితే 29.7 బిలియన్ డాలర్ల విలువ చేస్తాయి. ప్రపంచంలోని 87 దేశాల జిడిపి విలువ కంటే ఈ మొత్తం ఎక్కువగా ఉండటం గమనార్హం.
అత్యధికంగా ఏబీజీ షిప్‌యార్డ్..
గుజరాత్ కేంద్రంగా ఏబీజీ షిప్‌యార్డ్‌ను నిర్వహిస్తున్న రిసీ అగర్వాల్ ఎగనామంలో టాప్‌లో ఉన్నారు. ఆయనకు చెందిన ఏడు రుణ ఖాతాల నుంచి రూ.6,382 కోట్లు ఎగవేశారు. అమ్టెక్ ఆటో ప్రమోటర్ అర్వింద్ ధమ్ రూ.5,885 కోట్ల రుణాలను ఎగ్గొట్టి రెండో స్థానంలో ఉన్నారు. నితిన్, చేతన్ సందేశ్వర సోదరులు నిర్వహిస్తున్న స్టెర్లింగ్ గ్లోబల్ ఆయిల్ రీసోర్సేస్, వారి అనుబంధ సంస్థలు రూ.3,757 కోట్లకు పంగనామం పెట్టాయి. కపిల్, దీరజ్ వాద్వానీలకు సంబంధించిన దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు రూ.2,780 కోట్ల రుణాలను ఉద్దేశపూర్వంగా ఎగ్గొట్టాయి. రెయి అగ్రోను నిర్వహిస్తున్న సంజరు, సందీప్ ఝుంఝున్వాలా సోదరులు రూ.2,602 కోట్లు బాకీ పడి చెల్లించలేదు. గీతాంజలి జెమ్స్‌కు చెందిన మెహుల్ చోక్సీ, సురేఖ కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ ప్రమోటర్ సంజరు కుమార్, అతుల్ పుంజ్కు చెందిన పుంజ్ లాయడ్, జతిన్ మెహత తదితరులు రూ.2,000 కోట్లు పైగా చొప్పున బ్యాంక్‌లకు ఎగనామం పెట్టారు. స్థూలంగా తొమ్మిది కంపెనీలు రూ.2,000 కోట్ల పైన చొప్పున ఎగ్గొట్టాయి. రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల మధ్య ఏడు కంపెనీలు డిఫాల్ట్ అయ్యాయి. ఈ జాబితాలో డక్కన్ క్రానికల్ హోల్డింగ్స్, శక్తి భోగ్ ఫుడ్స్, సింటెక్స్ ఇండిస్టీస్, రొటమాక్ గ్లోబల్, ఎస్ కుమార్ నేషన్వైడ్ సంస్థలున్నాయి.
పీఎస్బీలకే అధిక నష్టం..
కార్పొరేట్లకు రుణాలు ఇచ్చి నష్టపోయిన వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వాటా 95 శాతంగా ఉంది. ఈ రుణాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటా 30 శాతంగా ఉంది. ఎస్బీఐ తర్వాత పీఎస్బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థలు 10 శాతం చొప్పున వాటాతో నష్టపోయాయి. ఒక్క ఏడాది రైతులకు పంట దిగుబడి రాక వారు తీసుకున్న ఒక్కటి, రెండు లక్షల రూపాయల రుణాలను వసూలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పెట్టే బ్యాంక్ అధికారులు, పారిశ్రామిక వర్గాల పట్ల మాత్రం భిన్నమైన వైఖరీని అవలంభిస్తున్నారు. పారిశ్రామిక రుణ మొండిగాళ్లకు ప్రభుత్వాధినేతల మద్దతు ఉండటమే ఇందుకు నిదర్శనమని అనేక విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సుడిగుండంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లే ఎక్కువగా బలైతున్నాయి. ఇకనైనా కార్పొరేట్లకు రుణాల జారీలో ప్రభుత్వాల చొరవ తగ్గితే తప్ప సర్కార్ బ్యాంక్‌లను కాపాడుకోవడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.