Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలసీదారులకు ఎల్ఐసి ప్రత్యేకావకాశం
న్యూఢిల్లీ : ఆర్థిక ఇబ్బందులు లేదా అనివార్య కారణాల వల్ల ప్రీమి యంలు సకాలంలో చెల్లించలేక బీమా పాలసీ రద్దు అయివుంటే తిరిగి పునరుద్దరించుకునే అవకాశం కల్పిస్తు న్నట్టు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా అన్ని యులిప్యేతర పాలసీలను ఆలస్య రుసుము చెల్లించి పునరుద్దరించుకోవడానికి ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ ఆగస్టు 17 నుంచి 21 వరకు అందుబాటులో ఉంటుందని బీమా దిగ్గజం తెలిపింది. పాలసీదారు ప్రీమియం చెల్లించని చివరి రోజు నుంచి ఐదు సంవత్సరాల లోపు పాలసీలను మాత్రమే పునరుద్దరించుకోవడానికి వీలుంది. తమ ఖాతాదారులు బీమా ప్రయోజనాలను కొనసాగించేందుకు ఇది అరుదైన అవకాశమని ఎల్ఐసి పేర్కొంది. రద్దయిన పాలసీల పునరుద్దరణలో భాగంగా ఆలస్య రుసుంలోనూ రాయితీ కల్పిస్తోంది. రూ.1 లక్ష లోపు ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలపై ఆలస్య రుసుములో 25 శాతం లేదా గరిష్టంగా రూ.2,500 తగ్గింపును ఇస్తున్నట్లు ఎల్ఐసి వెల్లడించింది. రూ.1 లక్ష -3 లక్షల మధ్య ప్రీమియం చెల్లించాల్సి ఉంటే ఆలస్య రుసుంలో 25 శాతం లేదా గరిష్టంగా రూ.3000 డిస్కౌంట్‌ను అందిస్తుంది. రూ.3 లక్షలు పైబడిన ప్రీమియం చెల్లించాల్సి ఉంటే 30 శాతం లేదా రూ.3500 వరకు రాయితీ కల్పిస్తోంది. సూక్ష్మ బీమా పాలసీలపై ఆలస్య రుసుంలో ఏకంగా 100 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ఎల్ఐసి వెల్లడించింది.
పాలసీ విక్రయాల్లో 60 శాతం వృద్ధి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఎల్ఐసి 36.81 లక్షల వ్యక్తిగత బీమా పాలసీలను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలోని 23.07 లక్షల పాలసీలతో పోల్చితే ఏకంగా 59.56 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. గడిచిన క్యూ1లో ఎల్ఐసి రూ.682.89 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ1లో రూ.2.94 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2022-23 జూన్ త్రైమాసికంలో 20.35 శాతం వృద్థితో రూ.98,351.76 కోట్ల బీమా ప్రీమియం వసూళ్లు చేసింది. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో రూ.81,721.41 కోట్ల ప్రీమియంను నమోదు చేసింది.