Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్వాన్స్డ్ ఫీచర్లతో త్వరలో యోనో 2.0
- ఎస్బీఐ చీఫ్ దినేష్ కుమార్ వెల్లడి
- మూడో సారి వడ్డీ రేట్ల పెంపు
ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రుణాల జారీలో 15 శాతం వృద్థి చోటు చేసుకునే అవకాశాలున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మెన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ ముఖ్యంగా రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతల నుంచి డిమాండ్ కొన సాగుతుందన్నారు. దేశంలో నే అతిపెద్ద విత్త సంస్థగా ఉన్న ఎస్బీఐ 2022 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం నాటికి 14.93 శాతం వృద్థితో రూ.29,00,636 కోట్ల రుణాలను చేరింది. గతేడాది ఇదే త్రైమాసికం ముగింపు నాటికి రూ.25,23,793 కోట్ల రుణాలు నమోదయ్యాయి. గడిచిన జూన్ త్రైమాసికంలో రిటైల్ రుణాల జారీలో ఏకంగా 18.58 శాతం, కార్పొరేట్ల అడ్వాన్సుల్లో 10.57 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. అతి త్వరలో ఆధునిక ఫీచర్లతో యోనో 2.0ను ఆవిష్కరించ నున్నామని దినేష్ కుమార్ తెలిపారు. డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో తమ నాయకత్వం కొనసాగనుందన్నారు. యోనో యాప్‌లో 5.25 కోట్ల మంది ఖాతాదారులు రిజిస్ట్రర్ నమోదై ఉన్నారన్నారు. తమకు ఇదో పెద్ద మైలురాయి అని అన్నారు. కొత్త సేవింగ్ ఖాతాల్లో 65 శాతం యోనో యాప్ ద్వారానే తెరువబడుతు న్నాయన్నారు. ఈ ఏడాది రుణాల జారీ అంశంలో కార్పొరేట్ బుక్ రూ.2.5-3 లక్షల కోట్లుగా ఉండొచ్చని దినేష్ ఖారా అంచనా వేశారు. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థలు దారిలో పడుతున్నాయన్నారు. కాగా.. ఇప్పటికీ భౌగోళిక పరిణామాలు అనేక సవాళ్లను విసురుతున్నాయ న్నారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, ముడి చమురు, కమోడిటీ ధర లు పెరుగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందన్నారు.
ఎఫ్డీలపై శుభవార్త..
భారతదేశ 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు, ఆజాదీ కా అమత్ మహోత్సవ్‌లో భాగంగా ఎస్బీఐ కొత్తగా''ఉత్సవ్ డిపాజిట్'' ప్రత్యేక టర్మ్ డిపాజిట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తోన్నట్లు తెలిపింది. 1000 రోజుల కాలవ్యవధితో ఎఫ్డీలపై ఏడాదికి 6.10శాతం వడ్డీ రేటును అందిస్తోన్నట్లు ఆ బ్యాంక్ ట్వీట్ చేసింది. సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50 శాతం అదనపు వడ్డీ రేటును పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్‌ను పరిమిత కాలం మాత్రమే అందిస్తున్నట్లు వెల్లడించింది.
రుణాలు మరింత భారం..
రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ మరో ప్రకటనలో తెలిపింది. మూడో మాసంలోనూ వరుసగా మూడోసారి రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆగస్టు 15 నుండి సవరించిన వడ్డీరేట్లు అమలులోకి వచ్చినట్టు ఆ బ్యాంకు ప్రకటించింది. దీంతో గృహ, వాహన, రిటైల్ తదితర రుణాలు మరింత భారం కానున్నాయి.
కోఠిలో జాతీయ జెండా ఆవిష్కరణ..
హైదరాబాద్‌లోని ఎస్బీఐ లోకల్ హెడ్ ఆఫీస్ కోఠిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీజీఎం అమిత్ జింగ్రాన్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత అభివృద్థి వైపే చూస్తున్నాయని జింగ్రాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.