Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండంకెల స్థాయిలోనే నమోదు
న్యూఢిల్లీ : ప్రభుత్వ హెచ్చు పన్నుల విధానాలతో దేశంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది జులైలో స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరసగా 16వ మాసంలోనూ రెండంకెల స్థాయిలోనే నమోదయ్యింది. గడిచిన నెలలో ఈ సూచీ 13.93 శాతంగా చోటు చేసుకుందని మంగళవారం ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా అహారోత్పత్తులు, చమురు, పెట్రోలియం, సహజ వాయువు, లోహాలు, విద్యుత్, రసాయనాలు తదితర ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నయ్యర్ అన్నారు. గడిచిన నెలలో కూరగాయల ధరల్లో మాత్రం కొంత తగ్గుదల చోటు చేసుకుందన్నారు. మొత్తం డబ్ల్యుపిఐలో అహారోత్పత్తుల వాటా 24.4 శాతంగా ఉంది. కాగా ఈ ద్రవ్యోల్బణం 10.77 శాతానికి తగ్గింది. ఇంతక్రితం నెలలో ఇది 14.39 శాతంగా నమోదయ్యింది. 2022 జూన్లో కూరగాయల ధరలు 56.75 శాతం పెరగ్గా.. జులైలో 18.25 శాతం పెరిగాయి. ఇదే సమయంలో పాల ధరలు 5.45 శాతం ఎగిశాయి. టోకు ద్రవ్యోల్బణంలో 13.15 శాతం వాటా కలిగిన ఇంధన ద్రవ్యోల్బణం గడిచిన నెలలో 27.01 శాతంగా చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా వరుసగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇంధన ధరలు ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లేలా చేశాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చు ధరలు ఇలాగే కొనసాగితే ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మాంద్యంలోకి జారుకోనుందని హెచ్చరిస్తున్నారు.