Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ‘ఇండియా వేర్ హౌసింగ్ మార్కెట్ రిపోర్ట్ -2022’ ప్రకారం గిడ్డంగుల (వేర్‌హౌస్) లావాదేవీల్లో హైదరాబాద్ 2022 ఆర్థిక సంవత్సరంలో 5.4 మిలియన్ చ.అ.ల లావాదేవీలను నమోదు చేసింది. 2021 ఆర్థిక సంవత్సరం నాటి 2.36 మిలియన్ చ.అ.లతో పోలిస్తే, ఏటేటా ప్రాతిపదికన 128% వృద్ధి నమోదు చేసింది. ప్రధానంగా 3పిఎల్ విభాగంలో పెరిగిన వృద్ధి కారణంగా ఈ వృద్ధి చోటు చేసుకుంది. పలు రిటైల్, ఇ- కామర్స్ కంపెనీలు తమ లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ కార్యకలాపాలను 3పిఎల్ సంస్థలకు అవుట్ సోర్సింగ్ కు ఇచ్చేందుకు మొగ్గచూపడంతో 3పిఎల్ సంస్థలచే హైదరాబాద్ లో వేర్ హౌసింగ్ కు డిమాండ్ బాగా పెరిగింది. 3పిఎల్ సేవలకు డిమాండ్ 2021 ఆర్థిక సంవత్సరం నాటి 24%తో పోలిస్తే, 2022 ఆర్థిక సంవత్సరంలో 31 శాతానికి పెరిగింది.
లావాదేవీల పరిమాణాన్ని పరిశ్రమ వారీగా విభజించి చూస్తే, 3పిఎల్ విభాగం గిడ్డంగులకు సంబంధించి అతిపెద్ద డిమాండ్ చోదక శక్తిగా ఉంది. 3 పిఎల్ సేవలకు డిమాండ్ 2021 ఆర్థిక సంవత్సరం నాటి 24%తో పోలిస్తే, 2022 ఆర్థిక సంవత్సరంలో 26 శాతానికి పెరిగింది. మొత్తం మీద చూస్తే మాత్రం, రిటైల్ రంగం అత్యధిక వృద్ధిని సాధించింది. 2021 ఆర్థిక సంవత్సరం లో ఉండిన 0% నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో 14 శాతానికి పెరిగింది. ఇతర రంగాలకు వస్తే, ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీడీ మినహా అన్ని తయారీ సంస్థలు కూడా వృద్ధిని చవిచూసింది. ఈ విభాగంలో వృద్ధి 2021 ఆర్థిక సంవత్సరంలో 2 శాతంగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 16 శాతానికి పెరిగింది. పెయింట్, ఫార్మా పరిశ్రమల నుంచి గణనీయ లావాదేవీలు చోటు చేసుకున్నాయి.
క్లస్టర్ వారీగా లావాదేవీలను చూస్తే, ఉత్తరాన హైదరాబాద్ – నాగపూర్ జాతీయ రహదారి పొడుగునా మేడ్చల్ క్లస్టర్ లో వేర్‌హౌస్‌లు వేర్‌హౌసింగ్ లావాదేవీల మార్కెట్ వాటాకు సారథ్యం వహించాయి. మొత్తం లావాదేవీల్లో ఈ ప్రాంతం లావాదేవీలు 2021 ఆర్థిక సంవత్సరం నాటి 48శాతంతో పోలిస్తే, 2022 ఆర్థిక సంవత్సంలో 60 శాతానికి పెరిగాయి. షంషాబాద్ క్లస్టర్ ఈ కార్యకలాపాల్లో తగ్గుదలను చవిచూసింది. గత ఏడాది దీని వాటా 51%గా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో అది 30 శాతానికి తగ్గిపోయింది.
ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో వ్యవస్థీకృత వేర్‌హౌసింగ్ రంగం అధిక వృద్ధి అనేది జీడీపీ వృద్ధి, కన్జ్యూమరిజం ఫలితం. భారతదేశంలో వేర్‌హౌస్ లీజింగ్ కరోనా మహమ్మారి ముందుకాలం నాటి స్థాయిని అధిగమించింది. ఈ రంగం ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి రంగాల కన్నా మిన్నగా ఉంది. వేర్ హౌస్ ఆస్తులను సొంతం చేసుకోవడం, అభివృద్ధి చేయ డం, నిర్వహించడంలో సంస్థాగల ఆసక్తి ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరగడం వృత్తిపర నైపుణ్యాలకు వీలు కల్పించి పరిపక్వత చెందిన మార్కెట్ వృద్ధి చెందేందుకు దారి తీసింది. పెట్టుబడుల పరంగా వేర్‌హౌస్ రంగం 2022 మొదటి అర్థవార్షికంలో 1.2 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు ప్రైవేటు ఈక్విటీని పొందింది. 2021 మొత్తం ఏడాదిలో ఇది 1.3 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండింది. ఈ రంగం భవితవ్యంపై అంతర్జాతీయ, భారతీయ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఇది ప్రదర్శిస్తోంది’’ అని అన్నారు.
‘‘మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం, భారతదేశ నూతన లాజిస్టిక్ విధానం ఈ వృద్ధికి తోడ్ప డ్డాయి. సెకండరీ మార్కెట్లలో నమోదైన పటిష్ఠ డిమాండ్‌తో, వేర్ హౌసింగ్ సంచలనం దేశంలోని 8 ప్రముఖ మార్కెట్లకు మించి కూడా రూపుదిద్దుకుంటోంది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ లు అభివృద్ధి దేశంలో మరిన్ని వేర్ హౌసింగ్ జోన్ల ఏర్పాటుకు దారి తీసి ఈ రంగం భౌగోళిక విస్తరణకు వీలు కల్పించనుంది’’ అని అన్నారు.