Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెపోరేటు మరో 0.50శాతం పెంపు
- రుణాలు మరింత ప్రియం
- వృద్ధి రేటు అంచనాలకు కోత
- ద్రవ్యోల్బణ కట్టడికి రెండేండ్లు పట్టొచ్చు
- గ్రామీణ బ్యాంక్‌ల్లోనూ ఇంటర్నెట్ బ్యాంకింగ్
- ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాల వెల్లడి
నవతెలంగాణ - బిజినెస్ డెస్క్
ఇప్పటికే రుణాలు పొందిన వారికి, ఇకపై అప్పులు తీసుకునే వారికి ఆర్బీఐ మరోసారి షాక్ ఇచ్చింది. కీలక వడ్డీ రేట్లను వరుసగా నాలుగో సారి పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. నిపుణులు, రేటింగ్ ఎజెన్సీల అంచనాలకు అనుగుణంగానే రెపోరేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచి.. 5.90 శాతానికి చేర్చింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత, రిటైల్ రుణాలు భారం కానున్నాయి. రుణ గ్రహీతలు అధిక వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల భేటీలో వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సమావేశంలోలని నిర్ణయాలను ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ద్రవ్యోల్బణ నియంత్రణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వద్ధిరేటు తగ్గుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ధరలను, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వివిధ దేశాలు ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయడంలో దూకుడుగా ఉండొచ్చని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.కరోనా ప్రభావానికి తోడు రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు వ్యవస్థలను ఒత్తిడికి గురి చేశాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాల వల్ల తలెత్తే తుపాన్ మధ్యలో ఉన్నామ న్నారు. ధరల కట్టడి కోసం వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్థి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి కోత పెట్టింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలనే లక్ష్యం నెరవేరడానికి రెండేండ్లు పట్టొచ్చని శక్తికాంత దాస్ అన్నారు. ఇటీవల దేశంలో ఆందోళనకంగా 7-8 మధ్య ద్రవ్యోల్బణం నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ) ఖాతాదారులకు కూడా ఇకపై ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సేవలు ప్రస్తుతం ఆర్బీఐ ముందస్తు అనుమతి ఉన్నవారికి మాత్రమే లభ్యమవుతున్నాయి. త్వరలోనే ఖాతాదారులందరూ ఈ సేవలు పొందడానికి వీలుంటుందన్నారు.
రియాల్టీపై ప్రతికూల ప్రభావం..
వడ్డీ రేట్ల పెంపు నిర్మాణ రంగాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఆర్బీఐ ఇంతక్రితం మేలో 0.40 శాతం, జూన్‌లో 0.50 శాతం, ఆగస్టులో మరో 0.50 శాతం పెంచగా.. తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో కేవలం నాలుగు మాసాల్లోనే రుణాలపై వడ్డీ రేటు 1.90శాతం ఎగిసింది. వడ్డీ రేట్ల పెంపును బ్యాంక్‌ను అతి త్వరలోనే ఖాతాదారులకు బదిలీ చేయనున్నాయి. దీంతో రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తం లేదా రుణం చెల్లింపు కాలం పెరుగనుంది. వడ్డీ రేట్ల పెంపునతో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. గృహ అమ్మకాలు డీల పడనున్నాయని ఆ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
11 లక్షల వరకు భారం..
రుణ గ్రహీత గతంలో 8.12 శాతం వడ్డీతో 20 సంవత్సరాల కాలపరిమితికి బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం తీసుకుంటే... ఇటీవల నాలుగు సార్లు పెంచిన వడ్డీ రేట్లతో.. రుణ పరిమితి కాలం మరో రెండేళ్ల మూడు నెలలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆ మొత్తానికి 8.62 శాతం వడ్డీతో రూ.50 లక్షలకు అదనంగా 11 లక్షల వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకింగ్ పరిశ్రమ వర్గాలు తెలిపా యి. ఖాతాదారు గతంలో నెలకు చెల్లించే రూ.37,929 వాయిదాతో పోలిస్తే తాజాగా పెరిగిన 1.9 శాతం రెపో రేట్ల కారణంగా రూ. 43,771 ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
ఎంపీసి భేటీలోని ప్రధానాంశాలు..
- రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల పెంపుతో 5.90 శాతానికి చేరిక.
- ధరల కట్టడి కోసమే వడ్డీ రేట్ల పెంపు.
- దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి.
- రెండు త్రైమాసికాలుగా పుంజుకుంటున్న ప్రయివేటు వినియోగం.
- ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంది.
- డాలర్‌తో పోల్చితే సెప్టెంబరు 28 నాటికి రూపాయి విలువ 7.4 శాతం తగ్గింది.
- 2022-23లో జిడిపి 7 శాతానికి పరిమితం కావొచ్చు.