Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల సమీకరణలో నిరాశ
- ఫండింగ్‌లో 80 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవ స్థ,టెక్ రంగంలో కీలకంగా మా రుతోన్న స్టార్టప్ సంస్థలు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. నిధులు లభ్యత తగ్గిపోయి.. నిరాశను చవిచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ చిన్న సంస్థలకు ఇవ్వడం లేదని స్పష్టమవుతోం ది. ప్రస్త్తుత ఏడాది జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో భారత స్టార్టప్‌లకు కేవలం 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.24వేల కోట్లు) నిధులు మాత్రమే సమకూరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో సమకూరిన 14.9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.19 లక్షల కోట్లు)తో పోల్చితే 80 శాతం తగ్గుదల చోటు చేసు కుందని ట్రాక్స్న్ జియో తన 'ఇండియా టెక్ క్యూ3 2022' త్రైమాసిక రిపోర్టులో తెలిపింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికం నిధుల సమీకరణతో పోల్చితే 57 శాతం తగ్గుదల చోటు చేసుకుంది.
గడిచిన క్యూ3లో సగటు టికెట్ సైజులోనూ భారీ తగ్గుదల చోటు చేసుకుంది. 2021 క్యూ3లో సగటున 142 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా.. గడిచిన క్యూ3లో ఇది 42 మిలియన్లకు పడిపోయింది. ఇది ఇన్వెస్టర్ల అనాసక్తిని ప్రదర్శిస్తుంది. దీనికి దేశంలో ఆర్థిక అనిశ్చిత్తిలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ''భారత్‌లోని స్టార్టప్‌ల నిధుల సమీకరణలో మందగమనం చోటు చేసుకున్న విషయం వాస్తవం. వచ్చే ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అంతర్జాతీయ ప్రతికూల అంశాలు కూడా స్టార్టప్ నిధుల లేమికి ఓ కారణం.'' అని ట్రాక్స్న్ ఫౌండర్ నేహా సింగ్ పేర్కొన్నారు. ''గడిచిన త్రైమాసికంలో 109 స్టార్టప్‌లు తమ తొలి నిధుల సమీకరణ యోచనను నిలిపివేసుకున్నాయి. మూడు స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాయి. 39 స్టార్టప్‌లు స్వాధీనం కాగా.. మరో రెండు ఐపీఓకు వెళ్లాయి' అని ఈ రిపోర్టు పేర్కొంది. అధిక నిధులు సమీకరించిన వాటిలో బెంగళూరు, ముంబయి, ఢిల్లీ-ఎన్సీఆర్లు టాప్‌లో ఉన్నాయి.