Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో 7.41శాతానికి సీపీఐ
- పడకేసిన పారిశ్రామికోత్పత్తి
- 18 మాసాల కనిష్టానికి ఐఐపీ
- వడ్డీ రేట్లు మరింత పెరగొచ్చు
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంటే.. మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి పడకేస్తుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఏడాది ఆగస్టులో భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ 0.8 శాతానికి పడిపోయి.. 18 మాసాల కనిష్ట స్థాయికి దిగజారింది. ఇంతక్రితం జులైలో ఇది 2.2 శాతంగా చోటు చేసుకుంది. వివిధ ఎజెన్సీల అంచనాలకు భిన్నంగా గడిచిన ఆగస్టులో ప్రతికూల వృద్థి చోటు చేసుకోవడం గమనార్హం. ఈ మాసంలో విద్యుత్ రంగం మాత్రమే సానుకూల వృద్థిని నమోదు చేయగా.. మైనింగ్, తయారీ ఉత్పత్తులు వరుసగా 3.9 శాతం, 0.7 శాతం చొప్పున తగ్గాయి. దేశంలో నమోదవుతున్న హెచ్చు ధరలు డిమాండ్‌ను దెబ్బతీస్తున్నా యి. దీంతో పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకాలు పడిపోవడంతో ఆ ప్రభావం తయారీపై పడుతుంది.
ధరల దెబ్బ..
ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 7.41 శాతానికి ఎగిసింది. అధిక అహారోత్పత్తులు, ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయని కేంద్ర ప్రభుత్వ గణంకాలు స్పష్టం చేశాయి. ఇంతక్రితం ఆగస్టులో ఈ సూచీ 7 శాతంగా చోటు చేసుకుంది. తాజా గణంకాలు ఆర్బీఐ విధాన పరపతిపై తీవ్ర ఒత్తిడిని పెంచనున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి అటూ, ఇటు 2 శాతానికి పరిమితం చేయాలని.. అంటే 2-6శాతానికి మధ్య ఉండేలా ఆర్బీఐ లక్ష్యంగా పెట్టు కోగా.. కొన్ని నెలల నుంచి ఈ పరిమితి దాటి ద్రవ్యోల్బణం నమోదవుతుంది. ఇది ఆర్బీఐ, కేంద్రానికి ప్రధాన సవాల్‌గా మారింది. హెచ్చు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 83 చేరువలో నమోదు కావడం.. దిగుమతి ఉత్పత్తుల ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది.