Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దగ్గరలోనే మాంద్యం
- వచ్చే ఏడాది వృద్థి 1.9 శాతమే..!
- పేదలకు మద్దతునివ్వాలి: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆందోళన
వాషింగ్టన్ : ప్రపంచం ప్రమాదపు అంచున ఉందని ప్రపంచ బ్యాంక్ డేవిడ్ మల్పాస్ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి దగ్గరగా ఉందన్నారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్థి రేటు అంచనాలను 3 శాతం నుంచి 1.9 శాతానికి కోత పెట్టినట్లు తెలిపారు. గురువారం వాషింగ్టన్లో జరిగిన ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంయుక్త వార్షిక సమావేశం అనంతరం మల్పాస్ మీడియాతో మాట్లాడుతూ.. అధిక ధరలు, వడ్డీ రేట్ల పెంపు, పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాలు అభివృద్థి చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇవి పేదలపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయన్నారు. ఈ నేపథ్యంలో పేదలకు మద్దతును అందించాలని ప్రపంచ దేశాలకు మల్పాస్ సూచించారు.
ఒక్కో దేశంలో ఒక్కో తరహా సమస్య నెలకొందన్నారు. వాటికి అనుగుణంగా పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని మల్పాస్ తెలిపారు. ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీరేట్లను పెంచడం ప్రారంభించగా.. ఇక మరిన్ని పెంపులు చేపట్టలేని స్థితికి చేరాయని తెలిపారు. అభివృద్థి చెందుతున్న దేశాలు రుణభారం సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడమే తీవ్ర సమస్యగా మారగా.. తీసుకున్న రుణాలపై అధిక వడ్డీలు పరిస్థితిని తీవ్ర జటిలం చేశాయని వెల్లడించారు. ఇదే సమయంలో ఆయా దేశాల కరెన్సీలు బలహీనంగా మారడం మరో పెద్ద సవాల్‌గా మారిందన్నారు. అధిక వడ్డీ రేట్లు, కరెన్సీల విలువ పడిపోవడంతో అప్పులభారం మరింత తీవ్రమైందన్నారు. ఉక్రెయిన్ను ఆదుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా నిధుల సమీకరణ చేయాలని యోచిస్తున్నామన్నారు.