Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుద్రారంలో రూ.30 కోట్లతో ప్లాంట్
నవతెలంగాణ - బిజినెస్ బ్యూరో
ప్రముఖ ప్రీమియం నిర్మాణ రంగ కంపెనీ అపర్ణ ఎంటర్ప్రైజెస్ తన యూపీవీసీ తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 450 టన్నుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. దీన్ని 700 టన్నులకు తీసుకువెళ్తున్నట్టు అపర్ణ గ్రూపు యూపీవీసీ విభాగం డైరెక్టర్ టి చంద్ర శేఖర్ తెలిపారు. బుధవారం నగరంలోని బాచుపల్లిలోని ప్రొఫైల్ యూనిట్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. నూతన యూనిట్‌ను రూ.25 కోట్లతో ఏర్పాటు చేశామని.. దీనికి మరో రూ.8 కోట్ల వ్యయం చేయనున్నామన్నారు. రుద్రారంలో మరో ప్లాంట్‌ను రూ.30 కోట్లతో అభివృద్థి చేస్తున్నామన్నారు. వచ్చే ఆరు నెలల్లోనే ఇది అందుబాటులోకి రానుందన్నారు. ఉత్పత్తి సామర్థ్యం విస్తరించడంతో పాటుగా 2023 సంవత్సరానికి నెలకు 1100 టన్నుల యూపీవీసీ ప్రొఫైల్ ప్రొడక్షన్ సామర్ధ్యం చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామ న్నారు. హైదరాబాద్ సమీపంలోనే సానిటైజేషన్ ఉత్పత్తుల ప్లాంట్ ఏర్పాటు యోచన చేస్తున్నామన్నారు. ఇందుకోసం 80 ఎకరాల స్థలాన్ని సమీకరించా మన్నారు. దీనికి దాదాపుగా రూ.200 కోట్ల పెట్టుబడులు అవసరం కావొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో యుపివిసి విభాగం రూ.90 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందన్నారు. నిర్మాణ రంగం భారీ వృద్ధి నమోదు చేస్తున్న నేపథ్యంలో యూపీవీసీ విండో, తలుపులకు డిమాండ్ పెరుగుతుందన్నారు.