Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి నాటికి అందుబాటులోకి
నవ తెలంగాణ - బిజినెస్ బ్యూరో
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్‌లో భాగమైన ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) పది ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేయనున్నట్టు ప్రకటించింది. సామాన్యులకు నాణ్యమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. భక్తుల కోసం ఈ బస్సులను తిరుమల కొండపైన నడపనున్నారని తెలిపింది. ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ శుక్రవారం టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డితో తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమావేశం అయ్యారు. ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణా రెడ్డి టీటీడీకి పది విద్యుత్ బస్సులను అందించేందుకు ఆశక్తిని కనపరుస్తూ రాసిన లేఖను ఈ సందర్భంగా ప్రదీప్ అందచేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పది బస్సులను అందిస్తామని తెలిపారు. తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణకు ఈ బస్సులు ఎంతో దోహదపడతాయని వైవి సుబ్బారెడ్డి అన్నారు. తొమ్మిది మీటర్ల పొడవు ఉండే ఈ ఎయిర్ కండీషన్డ్ బస్సులో డ్రైవర్‌తో కలిపి 36 సీట్లు ఉంటాయి. ఎలక్ట్రానిక్‌గా కంట్రోల్ చేసే ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యం ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు.. ఎమర్జెన్సీ బటన్, ప్రతీ సీటుకు యుఎస్బి సాకెట్ ఉంటుంది. లీథియం ఐయాన్ బ్యాటరీలు ఉన్న ఈ బస్సులు ఒక్కసారి చార్జి చేస్తే ట్రాఫిక్, ప్యాసింజర్ లోడ్లను బట్టి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి.