Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పగ్గాలు చేపట్టిన ఎలాన్ మస్క్
- సీఈఓ పరాగ్ సహా అగ్ర నాయకత్వంపై వేటు
న్యూయార్క్ : ట్విట్టర్ పక్షి టెస్లా గూటికి చేరింది. సోషల్ మీడియా దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. అయితే ఈ కొనుగోలు వ్యవహారం న్యాయస్థానాల వరకు వెళ్లింది. ఈ క్రమంలో న్యాయస్థానాలు విధించిన గడువు ఈ నెల 28లోగా ఒప్పంద ప్రక్రియనంతటినీ మస్క్ పూర్తి చేసి ట్విట్టర్ యజమానిగా పగ్గాలు చేపట్టారు. 44 బిలియన్ల డాలర్లకు ఈ కొనుగోలు ఒప్పందం జరిగింది. అయితే అధికారం తన చేతిలోకి వచ్చిన వెంటనే మస్క్ చేసిన మొట్టమొదటి పని, ట్విట్టర్ అగ్ర నాయకత్వానికి ఉద్వాసన పలకడం. ఇప్పటివరకు ముఖ్య కార్యానిర్వహణాధికారి (సీఈఓ)గా వున్న పరాగ్ అగర్వాల్, ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారి (సీఎఫ్ఓ) నెడ్ సెగల్, ట్విట్టర్ న్యాయ వ్యవహారాల విభాగ అధిపతి విజరు గద్దె తదితర అధినాయకత్వాన్ని మస్క్ తొలగించారు. ఈ మేరకు అంతర్జాతీయ, వాణిజ్య మీడియా సంస్థలు శుక్రవారం పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. ట్విట్టర్ జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్కు కూడా ఉద్వాసన పలికినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. వీరిలో పరాగ్ అగర్వాల్, విజయ గద్దెలను అత్యంత అవమానకరమైన రీతిలో శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుండి బయటకు పంపినట్లు తెలుస్తోంది. కాగా అటు ట్విట్టర్, ఇటు మస్క్ ఇరు పక్షాలు ఈ తొలగింపులను అధికారికంగా ధృవీకరించాల్సి వుంది.మొదటి నుంచి ట్విట్టర్ నాయకత్వం పట్ల మస్క్ తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే వున్నారు. తొలి నుంచి ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానంటూ భారీగా ప్రకటనలు చేసి ఆ దిశగా చర్చలు జరిపిన మస్క్ తర్వాత ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. స్పామ్ ఖాతాలు ఎన్ని వున్నాయో తెలియచేయనిదే ఈ కొనుగోలు ఒప్పందం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కంపెనీ అగ్ర నాయకత్వం నకిలీ ఖాతాలను దాచిపెట్టిందని విమర్శించారు. కంపెనీ సైబర్ సెక్యూరిటీ విధానాలు సరిగా లేవని ఈనెల ఆరంభంలో కోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో మస్క్ తరపు లాయర్లు పేర్కొన్నారు. దానిపై ట్విట్టర్ నాయకత్వం కోర్టును ఆశ్రయించడంతో అక్టోబరు 28లోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ట్విట్టర్‌కు సంబంధించి మస్క్ విధానాలు, ప్రణాళికలు ఏమిటన్నది కచ్చితంగా తెలియనప్పటికీ, ట్విట్టర్ మోడరేట్ విధానాల పట్ల మస్క్ చాలా అసంతృప్తిగా వున్నారు. విస్తృతంగా తలెత్తే అభిప్రాయాలన్నింటినీ చర్చించే వేదికగా ట్విట్టర్ మారాల్సిన అవసరం వుందని నొక్కి చెబుతున్నారు. ఇదిలావుండగా, ట్విట్టర్‌ను మస్క్ కైవసం చేసుకున్న నేపథ్యంలో విద్వేష ప్రసంగాలకు, తప్పుడు సమాచారానికి వేదికగా ట్విట్టర్ మారే అవకాశం వుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. కాగా కన్జర్వేటివ్‌లు మాత్రం ఈ కొనుగోలును దిద్దుబాటు చర్యగా స్వాగతిస్తున్నారు.