Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలకు రూ.1600 చార్జ్
- నెటిజన్ల ఆందోళన
వాషింగ్టన్ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ యూజర్లపై బాదుడుకు ప్రణాళికలు రూపొందించారు. బ్లూ టిక్ సహా అదనపు ఫీచర్ల కోసం ట్విటర్లో ప్రత్యేక పెయిడ్ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచన చేస్తున్నారని సమాచారం. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. పలు దేశాల్లో దీనికి ప్రస్తుతం వసూలు చేస్తున్న 4.99 డాలర్ల ఫీజును 20 డాలర్ల వరకు పెంచనున్నారు. ఇప్పటిదాకా బ్లూటిక్ అంటే గౌరవంగా, అధికారిక ఖాతాగా భావించేవారు. బ్లూ టిక్ సహా అదనపు ఫీచర్ల చందా ధరను 19.99 డాలర్ల (దాదాపు రూ.1600)కు పెంచడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని మస్క్ ఉద్యోగులను ఆదేశించారు. ఈ ఫీచర్‌ను నవంబర్ 7 కల్లా అందుబాటులోకి తేవాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సబ్స్క్రిప్షన్ పద్దతి అమల్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో నెలకు 5 డాలర్లు వసూలు చేస్తోంది. దీన్ని భారత్ సహా ఇతర దేశాలకు విస్తరించే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్ కొత్త ఆదాయాలపై దృష్టి కేంద్రీకరించారు. కాగా.. మస్క్ యోచనను తప్పు పడుతూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'ట్విటర్ బ్లూ' హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇది అనవసరపు వ్యయమని పేర్కొంటున్నారు. నెలకు రూ.1600 పెట్టే బదులు ఆ మొత్తాన్ని సిప్ లాంటి వాటిల్లో పెట్టుబడులుగా పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు.