Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాభాల్లో బహుళ రెట్ల వృద్థి
- క్యూ2లో రూ.15,952 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అత్యంత ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.15,952 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,433 కోట్ల లాభాలు ప్రకటించింది. దీంతో పోల్చితే సంస్థ నికర లాభాలు 11 రెట్లు పెరిగాయి. 2022 ఏప్రిల్ -జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.682.9 కోట్ల లాభాలు నమోదు చేసింది.
గడిచిన క్యూ2లో నికర ప్రీమియం ఆదాయం 27 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1.04 లక్షల కోట్ల ప్రీమియం వసూళ్లయ్యింది. క్రితం క్యూ2లో తొలి ఏడాది ప్రీమియం 11 శాతం పెరిగి రూ.9,124.7 కోట్లుగా నమోదయ్యింది. రెన్యూవల్ ప్రీమియం 2 శాతం ఎగిసి రూ.56,156 కోట్లుగా నమోదయ్యింది. సింగిల్ ప్రీమియం 62 శాతం వృద్థితో రూ.66,901 కోట్లుగా చోటు చేసుకుంది. శుక్రవారం బీఎస్ఈలో ఎల్ఐసీ షేర్ విలువ 1.17 శాతం పెరిగి రూ.628.05 వద్ద ముగిసింది.