Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంచనాలకు మూడీస్ భారీ కోత
- 2023లో 4.8 శాతమే
- ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల దెబ్బ
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్చు ద్రవ్యోల్బణం, వరుసగా వడ్డీ రేట్ల పెంపు ఇతర పరిణామాలు దేశ జీడీపీని దెబ్బతీస్తున్నాయని గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ విశ్లేషించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఏడాదిలో భారత వృద్థి రేటు అంచనాలను 7 శాతానికి కోత పెడుతున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 7.7 శాతంగా పేర్కొంది. ఈ ఏడాదిలో రెండో సారి కోత పెట్టడం గమనార్హం. ప్రస్తుత ఏడాదిలో 8.8 శాతం వృద్థి రేటు ఉండొచ్చని తొలుత మే నెలలో అంచనా వేసింది. దీన్ని సెప్టెంబర్లో సమీక్షించి.. ఈ అంచనాను 7.7 శాతానికి కుదించింది. తాజాగా శుక్రవారం మరో సారి కోత పెట్టింది. మే నాటి అంచనాలతో పోలిస్తే వద్ధిరేటు అంచనాలను 1.8 శాతం మేర కోత పెట్టినట్లయ్యింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి తోడు భారత్లో అధిక వడ్డీ రేట్లు, హెచ్చు ద్రవ్యోల్బణం జీడీపీకి ప్రతికూలంగా మారాయి.'' అని మూడీస్ తన 'గ్లోబల్ మ్యాక్రో ఔట్లుక్స్ 2023-24' రిపోర్టులో పేర్కొంది.
వచ్చే ఏడాది 2023లో వృద్థి రేటు మరింత పడిపోయి 4.8 శాతానికే పరిమితం కావొచ్చని మూడీస్ విశ్లేషించింది. 2024లో కొంత పుంజుకుని 6.4 శాతానికి చేరొచ్చని తెలిపింది. కరోనా పరిణామాల నుంచి కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ప్రపంచ వద్ధి నెమ్మదించడం వల్ల అవరోధాలను ఎదుర్కొంటుందని మూడీస్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అస్థిరత, సుదీర్ఘంగా కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాలను కఠినతరం చేయడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్లలోని ఒడుదొడుకులు ప్రపంచ వద్ధిరేటుకు సైతం విఘాతం కలిగించనున్నట్టు మూడీస్ పేర్కొంది.