Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఏడాదిలో బాధ్యతలు
న్యూఢిల్లీ : ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్‌గా సంద్యా దేవనాథన్ నియమితులయ్యారు. మెటా భారత వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆమె బాధ్యతలను కలిగి ఉంటారు. దేవనాథన్ కొత్త బాధ్యతలను 2023 జనవరి 1 నుంచి చేపట్టనున్నారని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ వెల్లడించారు. వ్యాపార నిర్వహణ, టీమ్ మేనేజ్మెంట్, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలలో సంధ్య దేవనాథన్‌కు ఉన్న అనుభవం భారత్‌లో బలపడేందుకు మరింత తోడ్పడుతుందని లెవిన్ పేర్కొన్నారు. ఇటీవల మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేయడంతో సంద్యాకు బాధ్యతలు అప్పగించనున్నారు. నూతన పదవీ బాధ్యతలను స్వీకరించేందుకు సంద్యా దేవనాథన్ త్వరలోనే ఇండియాకు రానున్నారు. ప్రస్తుతం మెటా ఆసియా-పసిఫిక్ డివిజన్ గేమింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతక్రితం ఆమె మెటా సింగపూర్ ఎండి, మెటా వియత్నాం బిజినెస్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2016 నుంచి మెటాలో పనిచేస్తున్నారు. 2000లో ఢిల్లీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ నుంచి ఎంబిఎ పూర్తి చేశారు. బ్యాంకింగ్, చెల్లింపులు, సాంకేతికతలో 22 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉంది. ఇటీవలే మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్‌గా శివనాథ్ తుక్రాల్‌ను కంపెనీ నియమించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి కీలక సోషల్ మీడియాలకు మెటా మాతృసంస్థగా ఉంది. ఇటీవల మెటాలో భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన విషయం తెలిసిందే.