Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారంలో 15 శాతం మేర పతనం
- పరేషాన్లో ఇన్వెస్టర్లు
హైదరాబాద్ : శేఖర్ శర్మ నేతృత్వంలో కొనసాగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వేదిక పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. ఈ కంపెనీ షేర్ విలువ వరుసగా పడిపోతుండటంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. నవంబర్ 18తో ముగిసిన వారంలో పేటియం షేర్ ఏకంగా 15.50 శాతం లేదా రూ.100.25 పతనమై రూ.546.40 వద్ద ముగిసింది. నవంబర్ 17న ఒక్క సెషన్లోనే 10 శాతం పైగా నష్టపోయింది. పేటియంలోని 4.5 శాతం వాటాకు సమానమయ్యే 2.95 కోట్ల షేర్లను సాఫ్ట్ బ్యాంక్ విక్రయించనున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అదే జరిగితే పేటియం మాతృసంస్థకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. గడిచిన వారంలో ఓ దశలో రూ.535 కనిష్టానికి పడిపోయింది.
గతేడాది నవంబర్‌లో ఐపిఒ లిస్టింగ్ సమయంలో పేటియం షేర్ రూ.2,150గా ఉంది. ఆ తర్వాత కాలంలో ఈ సూచీ ఎప్పుడూ పెద్దగా కోలుకున్నట్లు కనిపించడం లేదు. అనేక ఒత్తిడీలను ఎదుర్కొంటూ శుక్రవారం ముగింపు ధర రూ.546.40కు పడిపోయింది. వరుస పతనంతో ఐపిఒ సమయంలో స్టాక్స్ కొనుగోలు చేసిన మదుపర్లు లబోదిబోమంటున్నారు. తమ రిటర్న్స్ ఇప్పట్లో వచ్చేలా లేవని భావిస్తున్నారు.
ఇతర టెక్ షేర్ల దిగాలు..
గతేడాది మార్కెట్ల ఊపులో ఐపిఒకు వచ్చిన టెక్ స్టార్టప్‌లు పేటియం సహా జొమాటో, నైకా, పాలసీ బజార్ షేర్లు ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. లిస్టింగ్ నాటి ధరలతో పోల్చితే మదుపర్లకు నష్టాలనే మిగిల్చాయి. ఈ సంస్థల ఐపిఒలు లిస్టయిన 16 నెలల్లో మదుపర్లకు దాదాపు రూ.1.50 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చాయని మార్కెట్ గణంకాల అంచనా. జొమాటోలో ప్రారంభ పెట్టుబడులు చేసిన ఉబర్ టెక్నాలజీస్ వాటాను ఉపసంహరించుకోవడంతో ఈ షేరు రూ.67 స్థాయికి పడిపోయింది. బ్యూటీ ఉత్పత్తుల ఇ-రిటైలింగ్ చేసే నైకా షేరు కేవలం 15 రోజుల్లోనే 30 శాతం వరకూ నష్టపోయింది. పాలసీ బజార్ పేరెంట్ కంపెనీ పిబి ఫిన్‌టెక్ పరిస్థితి అలాగే ఉంది. గరిష్ట స్థాయిల నుంచి 70 శాతం విలువ కోల్పోయింది. లాజిస్టిక్ డెలివరీ షేర్ నాలుగు మాసాల్లో 50 శాతం మేర పడిపోయింది. ఈ పరిణామాలు స్టార్టప్ టెక్ కంపెనీలపై ఉన్న ఒత్తిడిని స్పష్టం చేస్తున్నాయి.