Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛానల్ గరిష్ట ధర రూ.19కి పెంపు
హైదరాబాద్ : అధిక ధరలు, హెచ్చు మొబైల్ బిల్లులతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న ప్రజలపై త్వరలోనే టివి ఛార్జీల పిడుగు పడనుంది. టివి ఛానల్ గరిష్ట ధరను రూ.19కు పెంచుతూ టెలికం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రారు) మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నూతన టారిఫ్ ఆర్డర్ (ఎన్‌టిఒ) 2.0ని ఆమోదించినట్లు వెల్లడించింది. ఇంతక్రితం ఛానల్ గరిష్ట ధర రూ.12గా ఉంది. తాజా పెంపు దెబ్బతో పలు ఛానళ్లపై రుసుం రూ.7 చొప్పున పెరగనుంది. ఛానెల్ బండిల్ డిస్కౌంట్లను గరిష్టంగా 45 శాతానికి పరిమితం చేసినట్లు ట్రారు పేర్కొంది. గరిష్ట ధరకు లోబడి ప్రసారకర్తలు తమ ఛానెల్‌కు స్వేచ్ఛగా ధరను నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ప్రసారకర్తలు తమ చెల్లింపు ఛానెల్, బొకెల (గంపగుత్త చానెళ్ల) కూర్పులోని గరిష్ట ధరల్లోని మార్పుల వివరాలను డిసెంబర్ 16లోగా సమర్పించాలని ట్రారు ఆదేశాలు జారీ చేసింది. కాగా పెంచిన కొత్త ధరలు 2023 ఫిబ్రవరి ఒక్కటో తేది నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. ఎన్‌టిఒ 2.0ను స్వాగతిస్తున్నామని ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబిడిఎఫ్) ప్రెసిడెంట్ కె మాధవన్ తెలిపారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బ్రాడ్కాస్టర్లు, డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లు పేర్కొన్నారు. ఇది వినియోగదారులపై మరింత భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.