Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో వ్యాపారం మూత
న్యూఢిల్లీ : భారత్‌లో తన మరో వ్యాపారాన్ని మూసివేస్తున్నట్టు గ్లోబల్ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. ఇటీవలే అమెజాన్ తన ఫుడ్ డెలివరీ, ఎడ్టెక్ సర్వీసెస్ అమెజాన్ అకాడమీని మూసి వేస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా తన హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ సేవలను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఇది డిస్ట్రిబ్యూషన్ యూనిట్ కంపెనీల నుండి వినియోగదారులకు, రీటైలర్లకు సంబంధిత ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. దీంతో కేవలం వారం రోజుల్లోనే మూడు వ్యాపా రాలను రద్దు చేసినట్లయ్యింది. నవంబరు 24న అమెజాన్ ఎడ్యుటెక్‌ను, ఫుడ్ డెలివరీని 25న మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబరు 29 నుంచి అమెజాన్ ఫుడ్ సర్వీసులు అందు బాటులో ఉండ వని ప్రకటించింది. కాగా..అమెజాన్ హోల్‌సేల్ వ్యాపారాన్ని ప్రధానంగా బెంగళూరు, మైసూరు, హుబ్లీ నగరాల్లో నిర్వహిస్తోంది. చిన్న వ్యాపారులు ఈ వెబ్సైట్ ద్వారా హోల్‌సేల్ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసు కుంటారు. ''మేం ఈ నిర్ణయాలను అనాలోచితంగా తీసుకోవడం లేదు. ప్రస్తుత ఖాతాదారులు, భాగస్వాములను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాపార కార్యకలాపాలను దశలవారీగా నిలిపివేస్తున్నాము. మా నిర్ణయాలతో ప్రభావితమయ్యే ఉద్యోగులకు అండగా ఉంటాము.'' అని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. పొదుపు చర్యల్లో భాగంగా అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 10వేల మందిని తొలగిస్తున్నట్టు ఇటీవల తెలిపింది. ఇందులో భాగంగానే భారత్‌లోనూ కోతలను ప్రారంభించింది.