Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెపోరేటు మరో 0.30% పెంపు
- అప్పులు మరింత భారం
- జీడీపీ తగొచ్చు
- ఆర్బీఐ ఎంపీసీ భేటీ నిర్ణయాలు వెల్లడి
ముంబయి : రుణ గ్రహీతలపై మరింత భారం పడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా ఐదో సారి వడ్డీ రేట్లను పెంచేసింది. మూడు రోజుల పాటు సాగిన ఆర్బిఐ ద్వైమాసిక మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీలో రెపో రేటును మరో 35 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సాగిన ఈ భేటీలో భారత వృద్థి రేటు అంచనాలకూ కూడా కోత పెట్టింది. అంతర్జాతీయ ప్రతికూల అంశాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. కీలక వడ్డీ రేట్లను మరోమారు పెంచడం ద్వారా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 225 బేసిస్ పాయింట్లు (2.25 శాతం) పెంచినట్లయ్యింది. ఆర్బిఐ ఇంతక్రితం మేలో 0.40 శాతం, జూన్‌లో 0.50 శాతం, ఆగస్టులో మరో 0.50 శాతం, అక్టోబర్‌లో 0.50 శాతం చొప్పున పెంచేసింది. దీంతో మే నెలలో 4.4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు తాజాగా 6.25 శాతానికి పెరిగింది. దీంతో రెపోరేటు 2018 ఆగస్టు నాటి స్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగ్గానే ఉందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. డిసెంబర్ 5-7 తేదిల్లో సాగిన భేటీ నిర్ణయాలను శక్తికాంత దాస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంగా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచిందన్నారు.
వృద్ధి రేటుకు కోత..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత వృద్ధి రేటు 6.8 శాతానికి తగ్గొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఇంతక్రితం సమీక్షాలో ఇది 7 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. దీనికంటే ముందు ఎంపిసి భేటీలో 7.2 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుతం డిసెంబర్‌తో ముగియనున్న త్రైమాసికంలో, వచ్చే త్రైమాసికంలో జీడీపీ వరుసగా 4.4 శాతం, 4.2 శాతం చొప్పున మాత్రమే పెరుగొచ్చని విశ్లేషించింది. 2023-24 జూన్‌తో ముగియనున్న తొలి త్రైమాసికంలో మళ్లీ 7.1 శాతం.. ఆ తర్వాత త్రైమాసికాల్లో 5.9 శాతం చొప్పున పెరుగొచ్చని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మెరుగ్గానే రాణిస్తుందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
యుపిఐ చెల్లింపుల పరిధి పెంపు
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పరిధి (బీబీపీఎస్), యూపీఐ సేవలను విస్తరించనున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. పన్ను చెల్లింపులు, అద్దె నుంచి పాఠశాల ఫీజుల వరకు ఏ రకమైన చెల్లింపునైనా చేయడానికి వినియోగదారులు త్వరలో బిబిపిఎస్ ఉపయోగించుకోవచ్చన్నారు. ఇందుకోసం బీబీపీఎస్‌ను మరింత ఆధునీకరించనున్నట్టు పేర్కొన్నారు. యుపిఐలో సింగిల్ బ్లాక్ అండ్ మల్టీపుల్ డెబిట్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులు ఇకపై తమ ఖాతాల్లోని నిధులను ఒక ప్రత్యేకమైన అవసరం కోసం వేరుచేసి బ్లాక్ చేసి ఉంచుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. ఇది సెక్యూరిటీలలో పెట్టుబడులు, ఆన్లైన్ షాపింగ్, హోటల్ బుకింగ్‌లకు సంబంధించిన చెల్లింపులను మరింత సులభతరం చేస్తుందని దాస్ తెలిపారు.
హెచ్చు ద్రవ్యోల్బణమే..
దేశంలో మరికొంత కాలమూ ద్రవ్యోల్బణం ఎక్కువగానే నమోదు కానుందని శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలని ఆర్బిఐ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎగువనే నమోదు కానుందన్నారు. అయితే రానున్న రోజుల్లో తగ్గుముఖం పడుతుందని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ పోరాటం మాత్రం ఇంకా ఆగలేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 6.7 శాతానికి ఎగువనే ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో 6.6 శాతం, వచ్చే ఏడాది జనవరి-మార్చిలో 5.9 శాతం, ఏప్రిల్-జూన్‌లో 5 శాతం, జులై- సెప్టెంబరులో 5.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు.
రియాల్టీపై ప్రతికూల ప్రభావం..
వడ్డీ రేట్ల పెంపునతో ముఖ్యంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. ఆర్బిఐ వరుస వడ్డింపునతో ముఖ్యంగా నిర్మాణ రంగం దెబ్బతినే ప్రమాదం మెండుగా ఉంది. వడ్డీ రేట్ల పెంపును బ్యాంక్‌లు అతి త్వరలోనే ఖాతాదారులకు బదిలీ చేయనున్నాయి. దీంతో రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తం లేదా రుణం చెల్లింపు కాలం పెరుగనుంది. వడ్డీ రేట్ల పెంపునతో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. గృహ అమ్మకాలు పడిపోయే అవకాశం ఉందని ఆ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.