Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెక్ కంపెనీలకు రెండో అతిపెద్ద కేంద్రం
- టి హబ్ నుంచి తొలి ప్రయివేటు రాకెట్
- వ్యాక్సిన్ల తయారీలో నెంబర్ వన్ : టై సమ్మిట్‌లో కేటీఆర్
నవ తెలంగాణ - బిజినెస్ బ్యూరో
టెక్నలాజీ, స్టార్టప్ కంపెనీల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన టై గ్లోబల్ సమ్మిట్ 2022లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 50 రంగాల్లో 6500 పైగా స్టార్టప్‌లు ఉన్నాయన్నారు. అంతరిక్షయానానికి సంబంధించి దేశంలోనే తొలి ప్రయివేటు రాకెట్‌ను ఇక్కడి టి హబ్ నుంచే స్కైరూట్ తయారు చేసిందన్నారు. నగరంలోని టిహబ్, వురు హబ్, రిచ్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నలాజీ తదితర సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఔత్సాహికవేత్తలను తయారు చేస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు.
'వచ్చే ఏడాది కల్లా రాష్ట్రంలో 1400 కోట్ల వాక్సిన్ డోసులు ఉత్పత్తి కానున్నాయి. ఇది ప్రపంచం వ్యాక్సిన్ ఉత్పత్తిలో సగం. ప్రస్తుతం 900 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతుంది. మొత్తం మానవాళికి కావాల్సిన వ్యాక్సిన్లలో మూడింటిలో ఒక వంతు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. దేశ జనాభాలో తెలంగాణ ప్రజలు 2.5 శాతం ఉండగా.. స్థూల దేశీయోత్పత్తిలో 5 శాతం వాటాను కలిగి ఉన్నాము. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 130 శాతం పెరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అమాంతం పెరిగింది. ఐటి ఎగుమతుల్లో 250 శాతం, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు 119 శాతం చొప్పున పెరిగాయి.'' అని మంత్రి కెటిఆర్ తెలిపారు.
'టెక్నలాజీ ప్రపంచంలో హైదరాబాద్ డీ అంటే డీ అని పోటీ పడుతోంది. అన్ని టెక్ కంపెనీల రెండో అతి పెద్ద క్యాంపస్‌లు ఇక్కడే ఉన్నాయి. అగ్రశ్రేణీ -5, 10, 20 ఏ టెక్నలాజీ కంపెనీలను తీసుకున్నా.. హైదరాబాద్‌లో దాదాపు తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్నాయి. బలమైన స్టార్టప్ ప్రగతిలో తెలంగాణ టాప్‌లో ఉందని డిపిఐఐటి గుర్తించింది. నిటి ఆయోగ్ ప్రకటించిన ఇండియా ఇన్నోవేషన్ సూచీలో నాలుగో స్థానంలో ఉన్నాము' అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టై గ్లోబల్ సమ్మిట్ 2022 కో ఛైర్మన్ మురళి బుక్కపట్నం, టై హైదరాబాద్ ప్రెసిడెంట్ సురేష్ రాజు, ఐటి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శాంతను నారాయన్ తదితరులు పాల్గొని మాట్లాడారు.