Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సియోమ్ ప్రెసిడెంట్ వెల్లడి
- పెరిగిన వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ : దేశంలోని అధిక వడ్డీ రేట్లు పరిశ్రమను, వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియోమ్) ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లకు తోడు దీర్ఘకాల వాహన బీమా ప్రీమియం వినియోగదారులకు ఇబ్బందులను కలిగిస్తుందన్నారు. ప్రస్తుత ఏడాది నవంబర్ వాహన అమ్మకాల గణంకాలను మంగళవారం సియోమ్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలోనే వాహన అమ్మకాలు జరిగినప్పటికీ 2010-11తో పోల్చితే మూడు చక్రాలు, 2016-17తో పోల్చితే ద్విచక్ర వాహన అమ్మకాలు తగ్గాయని వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు. 2021 నవంబర్ నెలతో పోలిస్తే గడిచిన నెలలో టోకు వాహనాల అమ్మకాల 19.8 శాతం పెరిగి 15,58,145 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 12,99,716 వాహన అమ్మకాలు జరిగాయి. వినియోగదారుల నుంచి సానుకూలత చోటు చేసుకున్నప్పటికీ.. అధిక వడ్డీ రేట్లు ఆందోళనకరంగా మారాయని సియోమ్ పేర్కొంది. ఆర్బీఐ గడిచిన మే నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు రెపో రేటును 2.25 శాతం పెంచి 6.25 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. దీంతో రుణాల చెల్లింపు భారమై వాహన కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడనుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.