Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చకు రాని సగం అంశాలు
- తేల్చని ఆన్లైన్ గేమింగ్‌పై టాక్స్
- కొత్త పన్నులేమీ లేవు..
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఆరు మాసాల తర్వాత తొలి సారి జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. శనివారం జరిగిన 48వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఎజెండాలో 15 అంశాలు ఉండగా.. కేవలం 8 అంశాలపైనే చర్చించారు. వర్చ్యూవల్‌గా జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏ వస్తువులపై కూడా కొత్తగా పన్నులు వేయలేదు. సమావేశం వివరాలను నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. సమావేశాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకే ముగించినట్లు మంత్రి తెలిపారు. ''పప్పుల పొట్టుపై ఇప్పటి వరకు వేస్తున్న 5 శాతం పన్ను రేటును తగ్గించారు. సమయం చాలకపోవడం వల్ల అప్పలేట్ ట్రిబ్యునళ్ల ఏర్పాటును చర్చించలేదు. అదే విధంగా పాన్ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతను అడ్డుకొనే యంత్రాంగానికి సంబంధించిన అంశాలు చర్చకు రాలేదు. ఈ సమావేశంలో కొత్త పన్నులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.'' అని మంత్రి సీతారామన్ తెలిపారు. ''ఆన్లైన్ గేమింగ్‌లపై 28 శాతం పన్ను వేయాలనే ప్రతిపాదనలపై సమయం లేకపోవడంతో చర్చించలేదు. అదే విధంగా క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి మేఘాలయ సిఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమర్పించిన సిఫార్సులు ఈ భేటీలో చర్చించలేదు. వస్తు సేవల పన్ను (జిఎస్టి) చెల్లింపుల్లో కొన్ని నేరాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా విచారణ ప్రారంభించేందుకు కావాల్సిన కనీస పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచారు.'' అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.