Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ రాజాం: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి రాజాంలోని జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMRIT) రజతోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) నిర్వహించిన ఎగ్జిబిషన్ స్టాల్‌ను, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం ఆయన విద్యార్థులు, పరిశోధకులతో సంభాషించారు. జీఎంఆర్ గ్రూపు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ‘సమాజంలో సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తోంది. గత 25 ఏండ్లకు పైగా విద్య, ఆరోగ్యం, ఉపాధి, జీవనోపాధులు, స్థానిక ప్రజల అభివృద్ధి సహా అనేక రంగాలలో పని చేస్తోంది.
ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు మాట్లాడుతూ “భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన నారాయణ మూర్తిని మన క్యాంపస్‌కు ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవం. విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్లుగా మారాలని ఆకాంక్షిస్తున్న యువతకు ఆయన ప్రేరణ. జీఎంఆర్ లో మేం ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను బలంగా విశ్వసిస్తాము. అది మా విలువలలో ఒకటి. జీఎంఆర్ వీఎఫ్ వెనుకబడిన యువతలో ఎంట్రప్రెన్యూర్షిప్ నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తోంది. మేము అలాంటి యువతతో కలిసి పని చేస్తూ, వారు తమ స్వంత సంస్థలను స్థాపించే అవకాశాలను కల్పిస్తున్నాము. నారాయణ మూర్తి గారు పంచుకున్న ఆలోచనలు ఈ యువకులు విజయాన్ని సాధించడానికి స్ఫూర్తిని ఇస్తాయని ఆశిస్తున్నాను” అన్నారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన నారాయణ మూర్తి మాట్లాడుతూ, ‘‘యువత సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. వారు తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు పక్కనపెట్టి, సమాజ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీ జీఎం రావుగారు చాలా పట్టుదల కలిగిన వ్యాపారవేత్త. ఇక్కడ చదువుకుంటున్న మీరంతా ఆయన మార్గంలో నడవాలని కోరుతున్నాను. గాంధీజీ చెప్పినట్లు మీరు ఏ మార్పు కావాలని కోరుతున్నారో, మీరే ఆ మార్పుగా మారాలి.’’ అన్నారు. ఈ పర్యటన సందర్భంగా నారాయణ మూర్తికి జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సీఈఓ అశ్వని లోహాని ఫౌండేషన్ కార్యకలాపాలపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్, జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ మరియు నాగావళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ (NIRED) వృత్తి శిక్షణా కేంద్రాన్ని కూడా నారాయణ మూర్తి సందర్శించారు.