Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: అంతర్జాతీయ హెల్త్‌కేర్ కంపెనీ వయాట్రిస్, మెడ్ యాక్సెస్, టీబీ అలయన్స్‌లు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ చికిత్సలో వినియోగించే ప్రీటోమనిడ్ (pretomanid) ఔషద ధర తగ్గింపు కోసం నూతన ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ప్రీటోమనిడ్ ధరను 34% వరకూ తగ్గించనున్నారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యుబర్క్యులోసిస్ రోగుల కోసం అత్యంత ప్రాధాన్యతగా చికిత్సలుగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించిన రెండు చికిత్సా విధానాలలో ప్రీటోమనిడ్ ఒకటి. మల్టీడ్రగ్ రెసిస్టెంట్ టీబీ (ఎండీఆర్–టీబీ) రోగుల చికిత్సలో 89–91% ప్రభావవంతమైనదిగా ప్రీటోమనిడ్ గుర్తించబడినది.
అంతర్జాతీయంగా మూడింట రెండొంతుల డ్రగ్ రెసిస్టెంట్ టీబీ రోగులకు విజయవంతంగా చికిత్సనందిస్తున్నారు. గతంలో ఈ చికిత్సా విధానాలు పరిమితంగా ఉండటంతో పాటుగా ఖరీదైనవిగా ఉంటూ సుదీర్ఘకాలం పాటు సాగేవి. రోగులు దాదాపు 9–20 నెలల పాటు 20 మాత్రలు ప్రతి రోజూ వేసుకోవాల్సి వచ్చేది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శకాలతో దాదాపుగా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ రోగులందరూ తక్కువ కాలం పాటు బెడాక్యులిన్(బీ), లైనెజోలిడ్(ఎల్), ప్రీటోమనిడ్ (పీఏ), మోక్సిఫ్లాక్సిన్ కాంబినేషన్ చికిత్స తీసుకుంటే సరిపోతుంది
వయాట్రిస్, మెడ్యాక్సెస్, టీబీ అలయన్స్‌లు ప్రీటోమనిడ్ ధర తగ్గించాలనే నిర్ణయం స్వాగతిస్తున్నామని గ్లోబల్ కొయలేషన్ ఆఫ్ టీబీ యాక్టివిస్ట్స్ సీఈఓ బ్లెస్సీ కుమార్ అన్నారు. డీఆర్–టీబీ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంలో ఇది తోడ్పడుతుందంటూ డీఆర్–టీబీ తో బాధపడుతున్న రోగులకు స్వల్పకాలపు మెరుగైన చికిత్సను అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరారు. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆరోగ్య ముప్పుగా పరిణమిస్తూ ప్రతి సంవత్సరం వేలాది మంది రోగుల జీవితాలపై ప్రభావం చూపుతుందని మెడ్ యాక్సెస్, సీఈఓ మైఖేల్ అండర్సన్ అన్నారు. ప్రీటోమనిడ్ ధర తగ్గింపుతో అత్యంత ప్రభావవంతమైన ఈ ఔషదం అవసరమైన రోగులకు మరింతగా చేరువవుతుందన్నారు.
వయాట్రిస్ అధ్యక్షుడు రాజీవ్ మాలిక్ మాట్లాడుతూ టీబీపై చేస్తోన్న పోరాటంలో ఈ భాగస్వామ్యం ఓ ముందడుగుగా అభివర్ణించారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ప్రభావిత రోగులకు మెరుగైన చికిత్సను అందుబాటు ధరలలో అందించనుందన్నారు. టీబీపై జరుగుతున్న యుద్ధంలో వెలకట్టలేని ఉపకరణంగా ఆరునెలల డీఆర్–టీబీ చికిత్స నిలిచిందని టీబీ అలయన్స్ ఎండీ, అధ్యక్షుడు మరియు సీఈఓ మెల్ స్పిగెల్మన్ అన్నారు.