Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య ఆంక్షలతో భారత్‌కే విఘాతం
- వృద్థి రేటుకే దెబ్బ
- నిటి అయోగ్ మాజీ వైస్ చైర్మెన్ హెచ్చరిక
న్యూఢిల్లీ : చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటే మనకే అధిక నష్టమని నిటి అయోగ్ మాజీ చైర్మెన్ అరవింద్ పనగారియా అన్నారు. సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణ వైఖరీ నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబందాలను తెగదెంపులు చేసుకోవాలనే ఉద్దేశ్యాలను ఆయన తప్పుబట్టారు. పనగారియా ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌గా ఉన్నారు. నిటి అయోగ్ తొలి వైస్ చైర్మెన్‌గా పని చేశారు. చైనాతో వాణిజ్య బంధాన్ని వదులుకుంటే భారత ఆర్థిక వద్ధిరేటు పడిపోనుందని హెచ్చరించారు. పొరుగు దేశంతో సంబందాలను రద్దు చేసుకునే దానికి బదులుగా బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలను చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగితే దేశ ఆర్థిక వద్ధిని త్యాగం చేయాల్సి వస్తుందన్నారు. ''సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రతీకారంగా చైనాను వాణిజ్యపరమైన ఆంక్షలతో శిక్షించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే ఆ దేశమేమీ ఊరికే చూస్తూ కూర్చోదు. అమెరికా వంటి అగ్రదేశాలు ఆంక్షలు విధించినప్పుడు దాని స్పందన ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పింది. రష్యాపై ఆంక్షలు విధించినందుకు ఇప్పుడు యూరప్ భారీ మూల్యమే చెల్లించుకుంటోంది'' అని పనగారియా గుర్తు చేశారు. ''చైనా ఆర్థిక వ్యవస్థ 17 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.. భారత ఆర్థిక వ్యవస్థ కేవలం మూడు ట్రిలియన్ డాలర్లుగానే ఉంది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ విధించే ఆంక్షల కంటే.. భారత్‌పై చైనా విధించే ఆంక్షల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అమెరికా లాంటి పెద్ద దేశమే ఇటీవల చైనా, రష్యాపై విధించిన ఆంక్షల నుంచి పెద్దగా ఫలితం పొందలేదు. భారత్ దిగుమతి చేసుకునే అనేక వస్తువుల్ని చైనా మాత్రమే తక్కువ ధరకు ఇస్తుంది.'' అని పనగారియా పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఈ నెల 9న ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మంది వాణిజ్య ఒప్పందాలపై సరైనా అవగాహన లేక చైనాతో వ్యాపారాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పనగారియా వ్యాఖ్యలు కీలకంగా మారాయి.