Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
- సెన్సెక్స్ 980 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లను కరోనా భయాలు బెంబేలెత్తిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ సూచీలు నష్టాలు చవి చూశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు కరోనా భయాలతో శుక్రవారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ 981 పాయింట్లు లేదా 1.6 శాతం పతనమై 59,845కు పడిపోయింది. ఇది అక్టోబర్ 28 నాటి కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఎన్ఎస్ఇ నిఫ్టీ 321 పాయింట్లు లేదా 1.8 శాతం నష్టంతో 17,807కు దిగజారింది. ఒక్క పూటలోనే బిఎస్ఇలో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోయింది. గడిచిన ఏడు సెషన్లలో దాదాపుగా రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. వారాంతం సెషన్లో ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశ లోనూ కొనుగోళ్ల అండ లభించకపోవడంతో భారీ నష్టాల్ని మూటగట్టు కున్నాయి. రూపాయి బలహీనతలు, చమురు ధరలు పెరగడం, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బిఐ వంటి దిగ్గజ షేర్లలో అమ్మకాలు వెల్లువ మార్కెట్లను కుదేలు చేశాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3 శాతం, 4 శాతం చొప్పున పడిపోయాయి. నిఫ్టీలో పిఎస్యు అధికంగా 6 శాతం పడిపోగా.. లోహ సూచీ 4 శాతం, రియాల్టీ 3 శాతం చొప్పున నష్టపోయాయి.