Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021లో డాలర్‌తో రూపాయి మారకం రూ.74.33
- 2022లో 82.72..ఒక్క ఏడాదిలో 11.3శాతం పతనం
- 2013 తర్వాత అత్యంత కనిష్టస్థాయికి భారతీయ కరెన్సీ
న్యూఢిల్లీ : భారతీయ కరెన్సీ రూపాయి..ఈ ఏడాది దారుణంగా పతనమైంది. ఆసియాలోనే అత్యంత ఎక్కువగా పతనమైన కరెన్సీగా రికార్డుల్లో నిలిచింది. 2021 ఏడాది ముగింపులో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.33 కాగా, డిసెంబర్ 2022 ముగింపు నాటికి రూ.82.72 వద్దకు చేరుకుంది. 2013 తర్వాత ఎన్నడూ ఈ స్థాయిలో రూపాయి మారకం విలువ పడిపోలేదు. ఈ ఏడాది రూపాయి మారకం విలువ 11.3శాతం పతనమైంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ (కేంద్ర బ్యాంక్) చేపట్టిన చర్యలు రూపాయి పతనానికి కారణమైంది. అక్కడ వడ్డీ రెట్లు పెంచడంతో భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోయాయి. ఇవన్నీ డాలర్లలో రూపంలో ఉంటాయి కాబట్టి, వెంటనే రూపాయి మారకాన్ని ప్రభావితం చేసింది. ఆసియాలో థారు బట్, మలేసియా రింగిట్, దక్షిణ కొరియా వాన్, ఫిలిప్పైన్స్ పెసో, ఇండోనేషియా రూపయ్యా, చైనా యువాన్ కరెన్సీ ఈ ఏడాది తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వీటన్నింటికంటే ఎక్కువగా భారతీయ రూపాయి దెబ్బతిన్నది. దీనికితోడు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటమూ రూపాయిని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ కరెంట్ ఖాతా లోటు రికార్డు స్థాయిలో పెరిగింది. ''అమెరికా వడ్డీ రెట్లు అధిక స్థాయిలో ఉండే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల మందగమనం దీర్ఘకాలిక మాంద్యంగా మారితే, భారతదేశ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయి. 2023లో రూపాయికి ఎదురయ్యే రెండు కీలక ప్రమాదాలు'' అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు చెందిన రీసర్చ్ హెడ్ రాజ్దీపక్ సింగ్ చెప్పారు. 2023లోనూ ప్రపంచాన్ని అనిశ్చిత పరిస్థితులు వెంటాడే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. పలు దేశాలు కఠినమైన ద్రవ్య విధానాలు, ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా షేర్ మార్కెట్ దిశను అంచనావేయటం క్లిష్టతరమైందని చెబుతున్నారు.