Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మాంద్యం భయాలు
వాషింగ్టన్ : ప్రముఖ టెక్ దిగ్గజం అమెజాన్ 18వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అధికారి కంగా ప్రకటించింది. ఇంతక్రితం నవంబర్‌లోని అంచనాల కంటే 80 శాతం మందికి అదనంగా ఉద్వాసన పలుకుతుందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలకు తోడు నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా ఈ చర్యకు దిగుతున్నామని ఆ కంపెనీ సిఇఒ ఆండీ జాస్సీ బుధవారం ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. ఇప్పటికే చాలా కంపెనీలు వ్యయాలు తగ్గించుకునే చర్యల్లో భాగంగా తొలగింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. 'ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని గడిచిన నవంబర్లోనే ప్రకటించాము. ప్రస్తుతం 18,000 సిబ్బందిని ఇంటికి పంపించాలని ప్రణాళికలు రూపొందించాము. ఈ ఉద్యోగాల తొలగింపు చాలా మందిని ప్రభావితం చేస్తాయని మాకు తెలుసు. కానీ కంపెనీ భవిష్యత్తును దష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.'' అని ఆండీ జాస్సీ తెలిపారు. ''తొలగింపబడిన వారికి ఆర్థిక ప్యాకేజీ సహా ఆరోగ్య బీమా ప్రయోజనాలు, వేరే కంపెనీలో ఉద్యోగం కోసం కావాల్సిన మద్దతు వంటి ప్యాకేజీలను అందిస్తాము. ఎవరిని తొలగించారనేది జనవరి 18 నుంచి తెలుస్తుంది.'' అని ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్‌లో మూడు లక్షల మంది ఉద్యోగులుండగా.. తాజా నిర్ణయాలతో 6 శాతం మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. 2022 నవంబర్లోనే ఉద్యోగుల తొలగింపును ప్రకటించినప్పటికీ కొంత మందికి ఉద్వాసన పలకగా.. పండగ సీజన్ నేపథ్యంలో మరికొంత మంది విషయమై వేచి చూసే దోరణీ అవలభించినట్లు తెలిపింది. దీంతో పండగ సీజన్ ముగియడంతో కంపెనీ అవసరాలు తీరడంతో తాజా చర్యకు పాల్పడినట్లయ్యింది. బిజినెస్ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ సైతం 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇది ఈ కంపెనీ మొత్తం సిబ్బందిలో 10 శాతానికి సమానం. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద తొలగింపు ప్రక్రియ. గూగుల్ మాతృసంస్థలో అల్పాబెట్లో మొత్తంగా 1.86 లక్షల మంది పని చేస్తుండగా.. ఇటీవల వారిలో 5.35 శాతం మందిని తొలగించింది. ఇదే బాటలో మెటాలో 13 శాతం మంది, ట్విట్టర్లో 50 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.