Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది రూ.16 లక్షల కోట్లు..!
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం భారీ అప్పుల సమీకరణపై దృష్టి పెట్టిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) ఎన్నికల ఏడాది కావడంతో మౌలిక వసతుల కల్పన, సంక్షేమం కోసం భారీ ఎత్తున ఖర్చు చేసే అవకాశం ఉందని రాయిటర్స్ పోల్‌లో మెజారిటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వ్యయాల కోసం భారత్ భారీగా అప్పులను సేకరించే అవకాశం ఉందన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కానుంది. అదే విధంగా ప్రస్తుత ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మందగించిన జిడిపిని గాడిలో పెట్టడానికి, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం, పేదల సంక్షేమం కోసం మోడీ సర్కార్ పెద్ద ఎత్తున ఖర్చు చేసే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రాబోయే ఆర్థిక సంవత్సరంలో 198 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 లక్షల కోట్లు) రుణాలు సేకరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు రాయిటర్స్ ఆర్థికవేత్తల పోల్ సర్వే వెల్లడిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.14.2 లక్షల కోట్లుగా ఉన్న ఉన్న స్థూల రుణ పరిమితి ఈసారి రూ.16 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా వేశారు. 2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో స్థూల వార్షిక రుణాలు రూ.5.92 లక్షల కోట్లుగా ఉంది. 2022 సెప్టెంబర్ ముగింపు నాటికి భారత దేశ మొత్తం రుణాలు రూ.147 లక్షల కోట్లుగా ఉన్నాయి.