Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికే కోతలు
- గూగుల్ సీఈఓ పిచాయ్ వెల్లడి
వాషింగ్టన్ : గూగుల్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడగా.. మరోవైపు ఉన్న సిబ్బంది బోనస్‌ల్లోనూ కోతలకు నిర్ణయం చేసింది. గూగుల్ వృద్ధి మంద గించిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాల్సి వచ్చిందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచాయ్ తెలిపారు. ఇటీవల గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్‌లో 12వేల మందికి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఇది కఠిన నిర్ణయమే అయినప్పటికీ.. గడ్డు పరిస్థితు లను ఎదుర్కోవడానికి అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో ముందస్తుగా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉందన్నారు.
సోమవారం కంపెనీ ఉద్యోగులతో అంతర్గతంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారని రిపోర్టులు వస్తున్నాయి. వ్యయాల నియంత్రణ కేవలం ఉద్యోగుల తొలగింపులతోనే ఆగిపోదని పిచాయ్ పేర్కొన్నారు. బాధ్యతాయుత నాయకత్వ హోదాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బోనస్‌ల్లోనూ కోతలు పెట్టనున్నామన్నారు. ఉద్యోగులందరికీ ఈ ఏడాది బోనస్‌లు తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేసి తాజాగా ఉద్యోగం కోల్పోయిన వారికి పరిహార ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ బృందానికి చెందిన విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోనూ గూగుల్ తొలగింపులకు పాల్పడింది.