Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐబీఎంలో 3,900 మందిపై వేటు
- ఎస్‌ఏపీలో 3000 మందికి కోత
న్యూయార్క్/ బెర్లిన్ : టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులో దూకుడుగా వ్యవహారిస్తున్నాయి. తాజాగా ఐబీఎం, ఎస్‌ఏపీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసనలు పలికాయి. ఐబీఎం 3,900 మందికి కోత పెట్టనుండగా.. ఎస్‌ఏపీలో 3,000 మందిని ఇంటికి పంపించాలని నిర్ణయించాయి. ఆర్థిక అనిశ్చిత్తుల నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకునే పనిలో ఈ చర్యలకు దిగాయి. 2022 అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో లక్ష్యాలను అందుకోలేకపోయామని, ఆదాయాలు పడిపోయి నట్లు ఐబీఎం తెలిపింది. మరోవైపు పెట్టుబడులను నిలిపివేసే కార్యక్రమం కూడా జరుగుతుందని వెల్లడించింది. వ్యయాలను తగ్గించుకోవడం కోసం ఉద్వాసనలు తప్పడం లేదని పేర్కొంది. అయితే కొన్ని కీలక విభాగాల్లో నియామకాలు ఉంటాయని వెల్లడించింది. 2022లో ఐబీఎం 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరాలని నిర్దేశించుకోగా.. 9.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. నిర్వహణ మూలధన వ్యయాలు అంచనాలను మించడమే ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణమని ఐబీఎం పేర్కొంది.
ఎస్‌ఏపీలో 2.5 శాతం మంది తొలగింపు
జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్‌ఏపీ(శాప్) ప్రస్తుత ఏడాదిలో 3వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది ఆ సంస్థలోని 2.5 శాతం మందికి సమానం. ఈ కంపెనీ సంప్రదాయ, క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సేవలను అందిస్తుంది. తమ ప్రధాన వ్యాపారాన్ని బలోపేతానికి వీలుగా చేపడుతున్న పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల తొలగింపునతో దాదాపు రూ.2800 కోట్లు (350 మిలియన్ డాలర్లు) అదా అవుతాయని ఆ కంపెనీ అంచనా వేసింది.