Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రెడిట్ సూస్సె షాకింగ్ నిర్ణయం
- కొనసాగిన షేర్ల పతనం
- కుబేరుల అగ్ర స్థానంలోకి మళ్లీ ముకేశ్
న్యూఢిల్లీ : అదానీ గ్రూపునకు మరో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. గౌతం అదానీ కంపెనీల బాండ్లపై మార్జిన్ రుణాల జారీని నిలిపివేస్తున్నట్లు స్విస్‌కు చెందిన ప్రయివేటు రంగ రుణదాత క్రెడిట్ సూస్సె తాజాగా ప్రకటించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నుంచి తీవ్ర మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ కంపెనీలకు ఇది మరింత శరఘాతంగా మారింది. ఈ రెండు సంస్థల దెబ్బకు బుధవారం స్టాక్ మార్కెట్‌లో అదానీ కంపెనీల షేర్లు పేక ముక్కల్లా కూలాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్ కంపెనీల బాండ్లకు సున్నా విలువను ఇస్తూ క్రెడిట్ సూస్సె నిర్ణయం తీసుకుందని.. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వ్యక్తులు వెల్లడించినట్లు రిపోర్టులు వచ్చాయి. ఇంతక్రితం అదానీ పోర్ట్స్ బాండ్లపై 75 శాతం రుణాలు ఇచ్చేవి. ఇతర బ్యాంక్‌లు కూడా అదానీకి రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని సమాచారం. అదానీ కంపెనీలకు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌లు రావొచ్చని బ్యాంక్‌లు ఆందోళన చెందుతున్నాయని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఒక్కరు తెలిపారు. ఆసియాలోని సంపన్న క్లయింట్లు పెట్టుబడులు పెట్టడానికి సెక్యూరిటీలపై తరచుగా రుణాలు తీసుకుంటారు. బ్యాంకులు సాధారణంగా సెక్యూరిటీ ధర యొక్క అస్థిరతను, రుణ విలువలను నిర్ణయించేటప్పుడు దాని క్రెడిట్ రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. అదానీ పరపతికి ఒక వేళ రేటింగ్ ఎజెన్సీలు కోత పెడితే ఆ కంపెనీలు మరింత ఒత్తిడిని ఎదుర్కోనున్నాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ సంపద, ఆయన కంపెనీల విలువ అమాంతం పడిపోతున్న నేపథ్యంలో రేటింగ్ ఎజెన్సీలు ఎలాంటి ప్రకటన చేయనున్నాయే వేచి చూడాలి. పలు కంపెనీల కుంభకోణాలు, మోసాల దెబ్బతో 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో క్రెడిట్ సూస్సె 1.6 బిలియన్ డాలర్ల నష్టాలు చవి చూసింది.