Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.100కు అయ్యే వ్యయం
- ప్రపంచంలోనే తక్కువ
- ఆదాయపు పన్ను అధికారి శిశిర్ అగర్వాల్ వెల్లడి
హైదరాబాద్ : భారతదేశంలో ఆదాయపు పన్ను వసూలుకు అయ్యే ఖర్చు ప్రపంచంలోనే అతి తక్కువని హైదరాబాద్ సర్కిల్ ఆదాయపు పన్ను ప్రధాన కమిషనర్ శిశిర్ అగర్వాల్ అన్నారు. ప్రతీ రూ.100 పన్ను వసూలు చేయడానికి కేవలం 57 పైసలు ఖర్చు అవుతుందన్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాత వాణిజ్యం, పరిశ్రమలకు సంబంధించి ఉత్పన్న మయ్యే విషయాలను చర్చించడానికి ఎఫ్టీసీసీఐ గురువారం హైదరాబాద్లో ఓ ప్రత్యేక సెమినార్ని నిర్వహించింది. దీనికి 200 మందికి పైగా నిపుణులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్బంగా శిశిర్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యల్ప ఖర్చు చేసే దేశాలలో ఒకరిగా ఉన్నామన్నారు. '' బ్రిటన్లో 73 పైసలు, జపాన్ 174 పైసలు, జర్మనీ 135 పైసలు, కెనడా 150 పైసలు, ఫ్రాన్స్ 111 పైసలు ఖర్చు చొప్పున వ్యయం అవుతోంది. మనకంటే తక్కువ ఖర్చు చేసే ఏకైక దేశం అమెరికా మాత్రమే.'' అని అగర్వాల్ తెలిపారు. '' ప్రజలు అసహ్యించుకోవడానికి ఇష్టపడే విభాగం మాది. మా అధికారిక హోదాలో వారిని సందర్శించాలని ఎవరూ కోరుకోరు. కానీ, మేము నిజంగా బాగా పని చేస్తున్నాము. చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాము. గణాంకాలు మా పనితీరును ప్రతిబింబిస్తున్నాయి. 2021-2022 సంవత్సరానికి మేము ఆల్ టైమ్ రికార్డ్ ట్యాక్స్ వసూలు చేశాము. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (ఆదాయపు పన్ను , కార్పొరేట్ పన్ను) రూ. 14.09 లక్షల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో బాగానే ఉంది. 14.08 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది కంటే 24 శాతం కంటే ఎక్కువ. అని శిశిర్ అగర్వాల్ తెలిపారు. ఈ సెమినార్లో సికింద్రాబాద్ కమిషనరేట్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ డిపి నాయుడు, ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.