Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాస్ఏంజెల్స్ : అమెరికన్ కంపెనీలు వరుస కట్టి ఆర్థిక అనిశ్చిత్తి భయాల్లో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఉద్యోగ కోతలపై రోజుకో కంపెనీ ప్రకటన చేస్తున్నాయి. తాజాగా వాల్డ్ డిస్నీ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా తమ 7,000 మంది ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. ఇది ఆ కంపెనీలోని 3.6 శాతం ఉద్యోగులకు సమానం. ఉద్వాసనలతో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలతో పాటు బోయింగ్ వంటి విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి 7వేల ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించామని వాల్డ్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ పేర్కొన్నారు. కంపెనీలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో డిస్నీకి ఖాతాదారులు ఒక్క శాతం తగ్గి 16.81 కోట్లకు పరిమితమయ్యారు. కంపెనీ ఆదాయం 23.512 బిలియన్ డాలర్లతో 1.279 బిలియన్ డాలర్ల లాభాలు నమోదయినట్టు ఆ కంపెనీ తెలిపింది.