Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ3లో రూ.8,334 కోట్ల లాభాలు
- రూ.1.11 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయం
ముంబయి : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3) ఏకంగా రూ.8,334 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.235 కోట్ల లాభాలతో పోల్చితే బహుళ రెట్ల వృద్ధి చోటు చేసుకుంది. కాగా.. గడిచిన జులై - సెప్టెంబర్ త్రైమాసికంలోనూ రూ.15,952 కోట్లు, ఏప్రిల్-జూన్ కాలంలో రూ.682.9 కోట్ల లాభాలు నమోదు చేసింది.
గడిచిన క్యూ3లో ఎల్ఐసీ నికర ప్రీమియం ఆదాయం 14.5 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.97,620 కోట్ల నికర ప్రీమియం నమోదయ్యింది. క్రితం డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ నూతన ప్రీమియం వ్యాపారం రూ.9,724.71 కోట్లకు పెరిగింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.8,748.55 కోట్ల ప్రీమియం నమోదయ్యింది. క్రితం క్యూ3లో పెట్టుబడులపై ఎల్ఐసీ నికర ఆదాయం 11 శాతం పెరిగి రూ.84,889 కోట్లకు చేరింది. గురువారం బీఎస్ఈలో ఎల్ఐసీ షేర్ విలువ 0.53 శాతం పెరిగి రూ.613.35 వద్ద ముగిసింది. వరుసగా ఐదు సెషన్లలో లాభాల్లో సాగింది.