Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడీస్ వెల్లడి
న్యూఢిల్లీ : అదాని కంపెనీలకు అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడిస్ భారీ షాక్ ఇచ్చింది. అదానికి చెందిన నాలుగు కంపెనీలకు రేటింగ్‌ను స్టెబుల్ (స్థిరత్వం) నుంచి నెగిటివ్ (ప్రతికూల)కు మార్చినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారం వెల్లడించింది. దీంతో అదాని డొల్ల వ్యవహారాలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌కు మరింత బలం చేకూరినట్లయ్యింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్ గ్రూపు, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్‌వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్ సంస్థలకు ఇచ్చిన రేటింగ్ ఔట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు మార్చింది. అదానీ గ్రూప్ సంస్థల్లో కార్పొరేట్ సుపరిపాలన లోపించిందని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పతనమవుతున్నది. ఇంతకుముందు క్రెడిట్ సూయిజ్, సిటీ బ్యాంక్ సంస్థలు కూడా అదాని గ్రూప్ సంస్థలు జారీ చేసిన బాండ్లకు విలువ లేదని.. వాటిని తనఖా పెట్టుకుని రుణాలు ఇవ్వకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు అదాని కంపెనీల షేర్లను మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సిఐ) వెయిటేజీని పున:సమీక్షించింది. నాలుగు అదానీ కంపెనీల వెయిటేజీని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వెయిటేజీని తగ్గించడమంటే ఆయా కంపెనీల షేర్లకు పెద్ద ప్రాధాన్యం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎఫ్‌పీఓపై సెబీ దర్యాప్తు..!
అదాని ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) ఉపసంహరణపై మార్కెట్ రెగ్యూలేటరీ సంస్థ సెబీ నిఘా పెట్టిందని తెలుస్తోంది. ఈ పబ్లిక్ ఆఫర్లో పాల్గొన్న ఇన్వెస్టరలపై సెబీ దర్యాప్తు చేస్తుందని సమాచారం. అదాని ఎంటర్ప్రైజెస్ భారీగా పడిపోయిన సమయంలోనూ యాంకర్ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందుకు వచ్చారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అప్పటికే భారీగా పడిపోతున్న ఈ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం.. ఎఫ్‌పీఓ పూర్తి సబ్స్క్రిప్షన్ కావడం అనుమానస్పదంగా ఉంది. క్లిష్ట సమయంలోనూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి)తోనూ రూ.300 కోట్ల పెట్టుబడులు చేయించారు. రూ.20వేల కోట్ల ఎఫ్‌పిఒలో పాల్గొన్న యాంకర్ ఇన్వెస్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండొద్దనేది నిబంధన. ఈ అంశంలోనూ సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరుగుతుందని సమాచారం. ఎఫ్‌పిఒలో పాల్గొన్న మరో రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలతోనూ అదాని గ్రూపునకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై సెబీ, అదానీ గ్రూపు ఎలాంటి ప్రకటన చేయలేదు.
నష్టాల్లోనే అదానీ షేర్లు..
ఎంఎస్సీఐ వెయిటేజీ తగ్గింపు, మూడీస్ పరపతి కోతతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లపై మరింత అనిశ్చిత్తి చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ సూచీలపై హిండెన్‌బర్గ్ ఒత్తిడి తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం సెషన్లోనూ అదానీ ఎంటర్ప్రైజెస్ 3.78 శాతం పతనమై రూ.1,853 వద్ద ముగిసింది. అదాని పవర్ 4.97 శాతం, అదాని విల్మర్ 0.95 శాతం, ఎన్డిటివి 3.65 శాతం చొప్పున నష్టాలు చవి చూశాయి.