Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రాంట్ థార్టన్ నియామకం పుకారు
- అదానీ గ్రూపు వెల్లడి
న్యూఢిల్లీ: అదానీ కంపెనీల్లో అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్టన్తో స్వతంత్రంగా ఆడిటింగ్ చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. అదానీ గ్రూపు తీవ్ర ఎకౌంట్స్ అక్రమాలకు పాల్పడుతూ, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుకుంటుందని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో అదానీ గ్రూపు లావాదేవీల ఆడిటింగ్‌కు ముందుకు వచ్చిందని.. దీంతో ఆ కంపెనీ తన పారదర్శకతను నిరూపించుకోనుందని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తమ సంస్థ ఎలాంటి విషయాలను దాచి పెట్టలేదని... ఆర్బీఐ ఇతర రెగ్యులేటరీ సంస్థలకు తమ పారదర్శకతను నిరూపించుకోవడానికి అదానీ గ్రూపు సిద్ధపడిందని రిపోర్టులు వచ్చాయి. దీనిపై అదానీ గ్రూపు గురువారం బీఎస్ఈకి వివరణ ఇస్తూ.. అలాంటిదేమీ లేదని తోసిపుచ్చింది. తాము ఎలాంటి ఆడిట్ సంస్థనూ నియమించుకోలే దని స్పష్టం చేసింది. అదంతా మార్కెట్ పుకార్లని తెలిపింది. తమ లావా దేవీలను ఎప్పటిలానే సెబీతో పంచుకుంటామని తెలిపింది.
డీబీ పవర్‌తో తెగిన ఒప్పందం
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో అదానీ కంపెనీలతో పలు విదేశీ సంస్థలు ఇప్పటికే తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. తాజాగా డీబీ పవర్‌కు చెందిన థర్మల్ విద్యుత్ ఆస్తుల కొనుగోలుకు అదానీ పవర్ 2022 ఆగస్టులో కుదుర్చుకొన్న ఒప్పందం సమయం ముగిసింది. ఒప్పందంలో నిర్ణయించిన తేదీ నాటికి లావాదేవీ పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. రూ.7,017 కోట్ల విలువ చేసే ఈ ఒప్పందాన్ని 2022 అక్టోబర్ 31 నాటికి పూర్తి చేసుకోవాల్సి ఉంది. తర్వాత ఈ గడువును నాలుగు విడతలు పొడిగించి 2023 ఫిబ్రవరి 15 వరకు పెంచినప్పటికీ.. ఈ గడువు ముగియడంతో ఒప్పందం రద్దయ్యింది.