Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ''టెక్నాలజీ బదిలీ'' ఒప్పందం
- రక్షణ దళాలకు ఆయుధాల తయారీ
హైదరాబాద్ : రక్షణ, సైనిక దళాలకు అవసరమైన అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన కారకల్ ఇంటర్నేషనల్ సంస్థతో సాంకేతికత బదిలీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ సంస్థ వెల్లడించింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూపునకు చెందిన ఐకామ్ సంస్థ భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంటుందని పేర్కొంది. రక్షణ రంగ ఆయుధాల తయారీ భాగస్వామ్యంలో తొలిసారి టెక్నాలజీ బదిలీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగా పని చేస్తున్న ఈడీజీఈ భాగస్వామ్య సంస్థ కారకల్‌తో మంగళవారం ఐకామ్ ''భాగస్వామ్యం - లైసెన్సింగ్'' ఒప్పందంపై సంతకం చేసింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రోత్సాహకాల్లో భాగంగా హైదరాబాద్ శివారులోని తన యూనిట్లో కారకల్ టెక్నాలజీతో చిన్నపాటి ఆయుధాలను తయారు చేసి, భారతీయ మార్కెట్ అవసరాలకు సరఫరా చేయనున్నట్లు ఐకామ్ తెలిపింది. ''భారత రక్షణ పరిశ్రమ సార్వభౌమత్వ అభివృద్థిలో ఈ సాంకేతిక ఒప్పందం కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. భారత రక్షణ రంగాన్ని స్వయం సమృద్థి చేయడానికి, దేశ రక్షణ ఆశయాలకు సహాయం చేయడానికి కారకల్ టెక్నాలజీ ఒప్పందం ఎంతో దోహదపడుతుంది'' అని ఐకామ్ మేనేజింగ్ డైరెక్టర్ పి సుమంత్ పేర్కొన్నారు.. కారకాల్ ఇఎఫ్ పిస్టల్, ఆధునిక సీఎంపీ 9 సబ్‌మెషిన్ గన్, సీఏఆర్ 814, సీఏఆర్ 816, సీఏఆర్ 817 టాక్టికల్ రైఫిల్స్, సీఏఆర్ 817 డీఎంఆర్ టాక్టికల్ స్నిపర్ రైఫిల్, కారకల్ సీఎస్ఆర్ 338, సీఎస్ఆర్ 308 బోల్ట్ యాక్షన్ స్నిపర్ రైఫిల్స్, సీఎస్ఏ 338 సెమీ ఆటోమేటిక్ స్నిపర్ రైఫిల్ ఆయుధాలన్నీ ఇకపై ఐకామ్లోనే తయారు కానున్నాయని ఆ సంస్థ తెలిపింది.