Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలలో అదానీ స్టాక్స్ సంపద ఆవిరి
- పతనంలోనే షేర్లు
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు షేర్లు కొనుగోలు చేసిన మదుపర్లకు పూడ్చుకోలేని నష్టాలు చవి చూస్తున్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు స్టాక్ మార్కెట్లో అదాని కంపెనీల షేర్లలో పతనం కొనసాగుతూనే ఉన్నది. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో నెల రోజుల లోపే గౌతమ్ అదానీ కంపెనీల సంపద రూ.11 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ఇది మొత్తం అదానీ గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్లో 57 శాతానికి సమానం. మంగళవారం నాటికి అదానీకి చెందిన 10 స్టాక్స్ విలువ రూ.8.2 లక్షల కోట్లకు పడిపోయింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ముందు రోజు అయినా.. జనవరి 24న ఈ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా రూ.19.2 లక్షల కోట్లుగా ఉన్నది. గౌతమ్ అదానీకి కీలకమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ 61 శాతం క్షీణించింది. అదానీ పోర్ట్స్ గరిష్ట స్థాయిల నుంచి 40 శాతం పడిపోయింది. షేర్ల వరుస పతనంతో ప్రపంచ కుబేరులో రెండో స్థానంలో ఉన్న అదానీ ఏకంగా 25 స్థానానికి పతనమయ్యారు. మంగళవారం సెషన్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర మరో 3.55 శాతం పతనమై రూ.1,563కు పడిపోయింది. 2022 డిసెంబర్లో ఈ సూచీ ఏకంగా రూ.4,190 గరిష్ట స్థాయికి చేరింది. ఆ సమయంలో ఈ కంపెనీ షేర్ కొనుగోలు చేసిన మదుపర్లు.. భారీ నష్టాలతో బోరుమంటున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం, అదాని టోటల్ గ్యాస్ 5 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 4.99 శాతం, అదానీ విల్మర్ 4.35 శాతం, ఏసీసీ 1.15 శాతం చొప్పున పతనమయ్యాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ సూచీలు మాత్రమే లాభాల్లో నమోదయ్యాయి. అదానీ కంపెనీలు తీవ్ర ఎకౌంట్స్ మోసాలకు, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుకుంటున్నాయని హిండెన్‌బర్గ్ తన రిపోర్ట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ దెబ్బకు అదానీపై జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని కోల్పోయారు. దీంతో అదానీ గ్రూపు కంపెనీల్లోని షేర్లను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రభావంతో ఆ స్టాక్స్ విలువ నెల రోజులగా క్రమంగా పడిపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మంగళవారం సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 18.82 పాయింట్లు కోల్పోయి 60,673 వద్ద నమోదయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 18 పాయింట్లు తగ్గి 17,827 వద్ద ముగిసింది.