Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: మ్యూజిక్ మెస్ట్రో, లివింగ్ లెజండ్, దక్షిణ భారత దేశంలో ఎన్నో తరాలుగా సంగీతాభిమానులను ఆకట్టుకుంటున్న డాక్టర్ ఇళయరాజా దాదాపు ఐదు సంవత్సరాల తరువాఆత హైదరాబాద్ నగరంలో తన సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఇళయరాజా సంగీతాభిమానులు ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సాయంత్రం 6.30 గంటల నుంచి ఇళయరాజా సంగీతఝురులలో తేలియాడవచ్చు. ఈ షోను హైదరాబాద్ టాకీస్ అండ్ మెర్క్యురీ నిర్వహిస్తోంది. ఈ కాన్సర్ట్ టిక్కెట్ ధరలు రూ.799 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ టిక్కెట్లు పేటీఎం ఇన్సైడర్ వద్ద అందుబాటులో ఉంటాయి.
ప్రపంచంలో అత్యుత్తమ కంపోజర్లలో ఒకరిగా ఖ్యాతి గడించిన డాక్టర్ ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇసైజ్ఞాని (సంగీత జ్ఞాని)గా గుర్తింపుపొందిన ఇళయరాజా ను మెస్ట్రోగా రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా లండన్ పిలుస్తుంటుంది. సంప్రదాయ భారతీయ సంగీతాన్ని పాశ్చాత్య సంగీత స్వరాలతో మిళితం చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. రాజా సార్‌గా ప్రేమగా పిలుచుకునే ఇళయరాజా, తన యుక్తవయసులోనే సంగీతం పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన తన కెరీర్లో సంగీత దర్శకునిగా 8500కు పైగా పాటలకు స్వరాలను అందించారు.తొమ్మిది భాషలలో దాదాపు 1500కు పైగా చిత్రాలకు ఆయన స్వరరచన చేశారు. ఐదు దశాబ్దాల తన కెరీర్లో 20వేలకు పైగా కాన్సర్ట్స్‌ను ఆయన చేశారు. అంతేకాదు, ఆసియాలో ఆయన మొట్టమొదటి సింఫనీ రచయితగా కూడా ఖ్యాతిగడించారు. పలు అవార్డులు, గౌరవాలను అందుకున్న ఇళయరాజా ఎంతోమంది సంగీత దర్శకులకూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారతీయ సినీ సంగీతంలో అసాధారణ ప్రయోగాలు చేయడం మాత్రమే తమ స్వరాలతో అన్ని తరాల సంగీత ప్రియులనూ ఆకట్టుకున్న ఇళయరాజా లైవ్ ఇన్కాన్సర్ట్కు సిద్ధంకండి, త్వరగా టిక్కెట్లను బుక్ చేసుకోండి.