Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీడీపీ గణంకాలపైనే ఇన్వెస్టర్ల దృష్టి
- వచ్చే వారంలోనూ అప్రమత్తత
ముంబయి: మార్కెట్లలో వరుస నష్టాలతో ఆందోళనలో ఉన్న మదుపర్లు వచ్చే వారంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 27తో ప్రారంభమయ్యే వారంలో మార్కెట్లను ప్రధానంగా భారత జీడీపీ గణంకాలకు తోడు తయారీ రంగం అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణంకాలను ఫిబ్రవరి 28న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇది ప్రధానంగా మార్కెట్లను ప్రభావితం చేయనుంది.
ఫిబ్రవరికి సంబంధించిన మ్యానుఫ్చాక్కరింగ్ పిఎంఐ డేటాను మార్చి మూడో తేదిన ఎస్అండ్పి విడుదల చేయనుంది. జనవరిలో ఈ సూచీ 55.4కు తగ్గి మూడు మాసాల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. డిసెంబర్లో ఇది 57.8గా ఉంది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన వాహన అమ్మకాలను మార్చి1న వాహన కంపెనీలు విడుదల చేయనున్నాయి. ఈ రిపోర్టులు ఆ రంగం సూచీలను ప్రభావితం చేయనున్నాయి.
2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత జీడీపీ 4.6 శాతానికి పరిమితం కావొచ్చని రాయిటర్స్ పోల్‌లో మెజారిటీ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇంతక్రితం జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం, ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 13.5 శాతం చొప్పున జీడీపీ నమోదయ్యింది. ఈ రెండు త్రైమాసికాలతోనూ పోల్చినా గడిచిన డిసెంబర్లో భారీ తగ్గుదల నమోదు కానుందని అంచనాలు వెలుపడుతున్నాయి. అదే జరిగితే స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత జనవరి నుంచి మార్చితో ముగియనున్న త్రైమాసికంలో వృద్ధి మరింత తగ్గి 4.4 శాతానికి మందగించనుందని రాయిటర్స్ పోల్‌లో నిపుణులు అంచనా వేశారు. 2023-24లో సగటున 6 శాతం వృద్ధి చోటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జనవరి 31న ప్రభుత్వం వేసిన అంచనా 6.5 శాతంతో పోల్చితే తక్కువగానే చోటు చేసుకోనుందని భావిస్తున్నారు.
ఈ నెల 16 నుంచి బిఎస్ఇ సెన్సెక్స్ 1856 పాయింట్లు లేదా 3 శాతం విలువ కోల్పోయింది. ఈ సమయంలో మదుపర్లు రూ.8.30 లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.8,30,322.61 కోట్లు కోల్పోయి రూ.2,60,00, 662.99 కోట్ల వద్ద ముగిసింది. దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లలో విశ్వాసాన్ని నింపడంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని నిపుణులు విమర్శిస్తున్నారు.
అదాని షేర్లపై నీలినీడలు..!
హిండెన్ బర్గ్ దెబ్బతో భారీగా పడిపోయిన అదాని గ్రూపు కంపెనీల షేర్లపై నీలినీడలు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే వారంలోనూ ఈ స్టాక్స్ పట్ల మదుపర్లు అప్రమత్తంగా వ్యవహారించే అవకాశం ఉంది. 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ రిపోర్టు వెల్లడయినప్పటి నుంచి అదాని గ్రూపు మార్కెట్ కాపిటలైజేషన్ రోజుకు సగటున రూ.52,343 కోట్లు పతనమవుతూ వచ్చింది. కేవలం నెల రోజుల్లో అదానీ గ్రూపు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 63 శాతం పతనమయ్యింది. కేవలం 23 ట్రేడింగ్ సెషన్లలో ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతం అదాని మూడో స్థానం నుంచి 29వ స్థానానికి దిగజారారు.
పీఎస్‌బీలపై ప్రభావం..
హిండెన్ బర్గ్ రిపోర్ట్ అదాని గ్రూపు కంపెనీలపైనే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల షేర్లపైన తీవ్ర ప్రభావం చూపింది. అదానికి అప్పులిచ్చిన పలు బ్యాంక్‌ల సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన నెల రోజుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 18 శాతం కోల్పోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17.1 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 17 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 16.3 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 15.6 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. తక్కువ ధర పలుకుతున్న ఈ సూచీలకు వచ్చే వారం మద్దతు లభించే అవకాశం ఉంది.