Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఆర్థిక మోసాల ఆరోపణలతో అదాని గ్రూపు షేర్ల పతనం ఆగక ముందే మరో కార్పొరేట్ దిగ్గజం వేదాంత స్టాక్స్ క్షీణత మొదలయ్యింది. వేదాంతా గ్రూపు అధినేత అనిల్ అగర్వాల్ అప్పుల ఊబిలో చిక్కుకున్నారని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఎస్అండ్పి బాంబ్ పేల్చింది. ఈ పరిణామంతో ఇన్వెస్టర్లలో ఆ కంపెనీపై విశ్వాసం సన్నగిల్లింది. దీంతో మంగళవారం వేదాంత లిమిటెడ్ షేర్ 6.58 శాతం లేదా రూ.18.90 పతనమై రూ.268.45కు పడిపోయింది. ఉదయం రూ.281 వద్ద తెరుచుకున్న ఈ సూచీ ఓ దశలో రూ.262 కనిష్ట స్థాయిని తాకింది. భారీ అప్పుల్లో ఉన్న ఈ కంపెనీ 2023 సెప్టెంబరు వరకు చెల్లించాల్సిన రుణాలకు ఇబ్బందేమీ ఉండబోదని ఎస్అండ్పి పేర్కొంది. అయితే.. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 2024 జనవరి వరకు తీర్చాల్సిన రుణ, బాండ్ల కోసం సుమారు రూ.12,400 కోట్ల నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కోనుందని అంచనా వేసింది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజూ నష్టాలు చవి చూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు చోటు చేసుకున్నప్పటికీ.. మంగళవారం కూడా నష్టాలు కొనసాగాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టంతో 59,962కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయి 17,304 వద్ద ముగిసింది. భారత జిడిపి పడిపోనుందన్న అంచనాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి.