Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ లిమిటెడ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వాటాలను విక్రయించనుందని తెలుస్తోంది. యస్ బ్యాంక్ సంక్షోభ సమయంలో మూడేళ్ల క్రితం ఆర్బీఐ సూచనల మేరకు ఎస్బీఐ సహా ఇతర విత్త సంస్థలు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టాయి. మార్చి 6 నాటితో ఎస్బీఐకి ఆర్బీఐ పెట్టిన మూడేండ్ల లాక్ఇన్ పీరియడ్ ముగియనుంది. ప్రస్తుతం యస్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి కూడా కొంత పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తనకున్న షేర్లను విక్రయించనున్నదని రిపోర్టులు వస్తున్నాయి. 2022 డిసెంబర్ 31 నాటికి ఎస్బీఐకి 26.14 శాతం వాటా ఉంది. మూడేండ్లు పూర్తయ్యే వరకు తమ వాటాను 26 శాతం కంటే దిగువకు తగ్గించుకోవడానికి వీలు లేదని ఆర్బీఐ అప్పట్లో నిబంధన పెట్టింది. సోమవారం నాటికి లాకిన్ గడువు ముగియనున్నది. యస్ బ్యాంక్‌లో వాటాల ఉపసంహరణపై త్వరలో ఎస్బీఐ బోర్డు భేటీ కానున్నదనీ.. ఇందులో ఎంత వాటాలు తగ్గించుకునే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 2020 మార్చిలో యస్ బ్యాంక్ తీవ్ర అప్పుల సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సమయంలో ఆ బ్యాంక్‌ను పునరుద్దరించేందుకు ఆర్బీఐ కల్పించుకుని ఎస్బీఐతో మెజార్టీగా 49 శాతం వాటాలను, ఎల్ఐసీ సహా ఇతర బ్యాంక్‌లతో వాటాలను కొనుగోలు చేయించింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌కు 2.61 శాతం,యాక్సిస్ బ్యాంక్‌కు 1.57 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 1 శాతం, ఎల్ఐసీ 4.34 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు 3.48 శాతం చొప్పున వాటాలున్నాయి. గురువారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేర్ 4.43 శాతం తగ్గి రూ.17.49 వద్ద ముగిసింది. మూడేండ్ల కిందట ఈ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేసే సమయంలో ఆ షేర్ ధర రూ.10గా ఉన్నది.