Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన గృహ రుణ గ్రహీతలకు ఆకర్షణీయ ఆఫర్ను ప్రకటించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు (0.40%) తగ్గించి 8.50గా నిర్ణయించినట్లు తెలిపింది. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రుణాలపై ప్రారంభ వడ్డీ రేటును 8.50గా ప్రకటించింది. ఈ రెండు ఆఫర్లు 2023 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. '' నూతన ఈ వడ్డీ రేట్లు పరిశ్రమలోనే అతి తక్కువ.. వడ్డీ రేట్ల తగ్గింపునతో పాటు ఈ నెల చివరి వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం రద్దు చేస్తున్నాం. ఎంఎస్ఎంఇ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీని కల్పిస్తున్నాం.'' అని బిఒబి తెలిపింది. నూతన గృహ రుణాల జారీపై మాత్రమే వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు తెలిపింది. అది కూడా రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ ఆధారంగా అని పేర్కొంది. ప్రత్యేక కాల పరిమితి కింద ఈ రుణ ఆఫర్లను అందిస్తున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజరు కె ఖురానా తెలిపారు. చౌక ధరల గృహాలను కొనుగోలు చేసే వారికి ఇదో మంచి అవకాశమన్నారు. ఎంఎస్ఎఇలకు మద్దతును అందించే ఉద్దేశ్యంతో ఆ రంగానికి వడ్డీ రేట్లను తగ్గించామన్నారు. బిఒబి వాల్డ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే గృహ రుణాలకు వేగంగా అనుమతులు ఇస్తోన్నట్లు తెలిపింది. లేదా తమ బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చని పేర్కొంది.