Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి త్రైమాసికంలో 4 శాతమే వృద్థి
- ఇండియా రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ మరింత మందగించనుందని రేటింగ్ ఎజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనున్న నాలుగో త్రైమాసికం (క్యూ4)లో భారత వృద్థి రేటు ఏకంగా 4 శాతానికి పతనం కానుందని ఇండియా రేటింగ్స్ తాజాగా అంచనా వేసింది. పూర్తి ఏడాదికి వృద్థి 7 శాతానికి మించకపోవచ్చని పేర్కొంది. 2022-23 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 13.2 శాతం, రెండో త్రైమాసికంలో 6.3 శాతం, మూడో త్రైమాసికంలో 4.4 శాతంగా జిడిపి నమోదయిన విషయం తెలిసిందే. వరుసగా పడిపోతూ వస్తోన్న వృద్థి ప్రస్తుత మార్చి త్రైమాసికంలోనూ మరింత క్షీణించి 4 శాతానికే పరిమితం కావొచ్చని ఇండియా రేటింగ్స్ అనలిస్ట్ పారస్ జస్రాయి అంచనా వేశారు. 2022-23లో స్థూలంగా 7 శాతంగా ఉండొచ్చన్నారు.
దేశంలో సరుకులకు డిమాండ్ తగ్గనుందని ఆ రేటింగ్ ఎజెన్సీ పేర్కొంది. అంతర్జాతీయ మందగమనానికి తోడు ఎగుమతుల పతనం, కఠిన ద్రవ్య పరపతి విధానంతో రుణాల జారీలోనూ తగ్గుదల చోటు చేసుకోవచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం త్రైమాసికాల్లో మందగించిన తయారీ రంగం గణంకాలను గుర్తు చేసింది. ఉత్తరాదిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గోదుమల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొంది. ఇది వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేయడమే కాకుండా, కరోనా నుండి ఒత్తిడిలో ఉన్న గ్రామీణ డిమాండ్‌పై మరింత ప్రతికూల ప్రభావం చూపడంతో పాటుగా ద్రవ్యోల్బణం పెరుగొచ్చని జస్రారు విశ్లేషించారు.
ప్రస్తుత ఏడాది జనవరిలో ఎగుమతులు 6.6 శాతం క్షీణించి 32.91 బిలియన్ డాలర్లకు పరమితమయిన విషయాన్ని ఇండియా రేటింగ్స్ గుర్తు చేసింది. కరోనా సంక్షోభం తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత తగ్గినట్లు పేర్కొంది. అక్టోబరు నుంచి డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 4.4 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ గత మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన తయారీ రంగం గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో పేలవ ప్రదర్శన కనబర్చింది. గడిచిన క్యూ3లో ఈ రంగం 1.1 శాతానికి క్షీణించింది. ఇంతక్రితం క్యూ2లో ఇది 3.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని బిజెపి పాలకులు చేస్తున్న ప్రచారానికి ప్రభుత్వ, ప్రయివేటు ఎజెన్సీల గణంకాలు షాక్‌ను ఇస్తున్నాయి. హెచ్చు ధరల వల్ల దేశంలో వస్తువులకు డిమాండ్ పడిపోయింది. ఈ ప్రభావం తయారీ ఇతర రంగాలపై ఎక్కువగా పడింది. ఈ అంశాలు ఆర్థిక వ్యవస్థను మరింత మందగమనంలోకి నెట్టుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.