Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 671 పాయింట్ల పతనం
- ఒత్తిడిలో పలు అదానీ షేర్లు
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలు చవి చూశాయి. గురువారం సెషన్లో పలు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా రిలయన్స్, అదానీ, హెచ్‌డిఎఫ్‌సి షేర్ల పత నంతో మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ఉదయం నుంచే నష్టాల బాటలో ప్రారంభమైన బిఎస్ఇ సెన్సెక్స్ తుదకు 671 పాయింట్లు లేదా 1.12 శాతం పతనమై 59,135కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 177 పాయింట్లు కోల్పోయి 17,413 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 58,885, నిఫ్టీ 17,324 కనిష్ట స్థాయిల వద్ద నమోదయ్యాయి. బిఎస్ఇలోని లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.262.7 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్క పూటలోనే రూ.1.6 లక్షల కోట్లు నష్టపోయినట్లయ్యింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్క శాతం చొప్పున పడిపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అధికంగా 2.6 శాతం నష్టపోగా.. రిలయన్స్ ఇండిస్టీస్, ఎల్‌అండ్‌టి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్ 1.5 శాతం వరకు నష్టపోయి.. సూచీలను మరింత ఒత్తిడికి గురి చేశాయి. బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాల సూచీలు అధికంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ప్రధాన కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు వర్థమాన దేశాల మార్కెట్లపై పడింది. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఎస్విబి ఫైనాన్షియల్ గ్రూప్ సంక్షోభం అంచుకు చేరుకుందన్న వార్తలు అమెరికా బ్యాంకింగ్ స్టాక్స్‌ను తీవ్ర కలవరానికి గురి చేశాయి. ఆ బ్యాంక్ మార్కెట్ కాపిటలైజేషన్ 80 బిలియన్ డాలర్లు తుడుచుకుపెట్టుకుపోయింది. ఇది భారత బ్యాంకింగ్ స్టాక్స్‌పై ప్రభావం చూపింది. అదాని గ్రూపు కంపెనీల షేర్లు మిశ్రమంగా నమోదయ్యాయి. ప్రధానమైన అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ 2.9 శాతం పతనమై 1,896.45కు దిగజారింది. అదాని విల్మర్ సూచీ 4.5 శాతం, ఎన్డిటివి 5 శాతం చొప్పున నష్టపోయాయి.