Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికన్ బ్యాంక్‌ల సెగ
- సెన్సెక్స్ 2500 పాయింట్ల పతనం
- అదాని స్టాక్స్ విలవిల
ముంబయి : అమెరికన్ బ్యాంక్‌ల సంక్షోభం భారత స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. వరుస నష్టాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఐదు మాసాల కనిష్టానికి పడిపోయాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగేచర్ బ్యాంక్‌ల దివాళాతో వరుసగా నాలుగు సెషన్లలో బిఎస్ఇ సెన్సెక్స్ 2500 పాయింట్లు లేదా 4 శాతం పతనమయ్యింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ సూచీ 719 పాయింట్లు కోల్పోయింది. కాగా.. మంగళవారం సెషన్లో సెన్సెక్స్ 338 పాయింట్లు పతనమై 57,721కి పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 17,043 వద్ద ముగిసింది. ఐటి, లోహ, బ్యాంకింగ్ షేర్లు అధికంగా ఒత్తిడికి గురైయ్యాయి. నిఫ్టీలో పిఎస్‌యు బ్యాంకింగ్ స్టాక్, ఐటి రంగాలు 1.65 శాతం చొప్పున నష్టపోయాయి. ఒక్క పూటలో మదుపర్ల సంపద రూ.2 లక్షల కోట్లు ఆవిరయ్యింది. అదాని గ్రూపు షేర్లు అన్నీ నష్టాలు చవి చూశాయి. అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ ఏకంగా 7.25 శాతం కోల్పోయింది. అదాని పోర్ట్స్ 3.93 శాతం, అదాని పవర్ 4.99 శాతం, అదాని ట్రాన్స్మిషన్ 5 శాతం, అదాని టోటల్ గ్యాస్ 5 శాతం, అదాని విల్మర్ 4.96 శాతం చొప్పున కుప్పకూలి లోహర్ సర్క్యూట్‌ను తాకాయి. సెన్సెక్స్-30లో మహీంద్రా అండ్ మహీంద్రా అధికంగా 3 శాతం పడిపోయింది. టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ బ్యాంక్, విప్రో, టెక్ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్, హెచ్‌సిఎల్ టెక్నలాజీస్, ఐటిసి షేర్లు 1-2 శాతం మేర అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 0.44 శాతం పడిపోయి రూ.82.49కి దిగజారింది. గడిచిన వారం రోజుల్లోనే సిల్వర్ గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్విబి), సిగేచర్ బ్యాంక్‌లు దివాళా తీశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై ఒత్తిడి నెలకొంది. ఆసియన్ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.