Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట్రాడేలో 900 పాయింట్లు ఫట్
ముంబయి : బ్యాంకింగ్ సంక్షోభ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. సోమవారం ఉదయం నుంచి తుది వరకు నష్టాల్లోనే సాగాయి. సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా 900 పాయింట్లు కోల్పోయింది. అదాని షేర్ల అమ్మకాలు కొనసాగడంతో నష్టాలు చవి చూశాయి. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 361 పాయింట్లు లేదా 0.62 శాతం పతనమై 57,629కి పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు తగ్గి 16,988 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఒక్క ఎఫ్ఎంసీజీ రంగం మినహా అన్ని రంగాలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్, లోహ సూచీలు 2 శాతం నష్ట పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అమెరికా, యూరప్ ప్రాంతాల్లోని ఎస్వీబీ, సిగేచర్ బ్యాంక్, క్రెడిట్ సూస్సె తదితర బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు అమ్మకాలకు దిగేలా చేశాయి. ఈ వారం జరగనున్న ఫెడ్ సమావేశం నేప థ్యంలో మదుపర్లు ముందు జాగ్రత్తగా అచీతూచి వ్యవహారించారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచనుందనే అంచనాలు బ్యాంకింగ్ సూచీలను మరింత ఒత్తిడికి గురి చేసింది. హిండెన్ బర్గ్ నివేదికతో జనవరిలో ప్రారంభమైన అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ గ్రూపులోని కంపెనీల షేర్లు ఆల్‌టైం కనిష్ట స్థాయికి పడిపోవడంతో.. కొద్ది రోజులు కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ.. తిరిగి మళ్ళీ పతనాన్ని చవి చూస్తున్నాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ లోయర్ సర్క్యూట్‌ని తాకాయి. అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ 3.84 శాతం, అదాని పోర్ట్స్ 1.96 శాతం, అదాని టోటల్ గ్యాస్ 4.99 శాతం, అదాని పవర్ 4.83 శాతం చొప్పున నష్టాలు చవి చూశాయి. ఒక్క అదానీ గ్రీన్ ఎనర్జీ మాత్రమే స్వల్పంగా లాభపడింది.